CM విజయ్ మీద, తమిళనాడు రాజకీయాల మీద పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు పై నా ఆలోచనలు
విజయ్ రాజకీయ విజయం, తమిళనాడు పరిస్థితులు, జనసేన పార్టీ నిర్మాణం, పవన్ కళ్యాణ్ నిర్ణయాల మీద ఒక విమర్శాత్మక విశ్లేషణ.

పార్టీ నడపడం కష్టం అంటారు. ఇది రాజకీయాలు నాకు ప్యాషన్, పబ్లిక్ సర్వీస్ నా ప్యాషన్ అంటారు. ప్యాషన్ ఉన్నోళ్లకు కష్టం అనిపించదు. వందలు, లక్షల మందికి సహాయం చేయడానికి ఉంటే కష్టం ఏంటి? ప్యాషన్ లేకుంటేనే కష్టం అనిపిస్తుంది. సరైన వ్యక్తులకు బాధ్యతలు ఇవ్వకపోతే ఇలానే ఉంటాయి.
పరిస్థితులు బాగోలేనప్పుడే కొత్త పార్టీలకు అవకాశాలు ఉంటాయి. లేదంటే అన్నీ పరిస్థితులు బాగుంటే కొత్త పార్టీకి అవకాశం ఎందుకు ఇవ్వాలి అనుకుంటారు?
“2007 నుంచి వెయిట్ చేస్తున్నాం”, “సాధక్” అంటూ పార్టీ స్ట్రక్చర్ బిల్డ్ చేయడానికి వచ్చాం అంటారు. ఈ స్టేట్మెంట్ విన్నాక నవ్వాలో ఏడవాలో అర్థం కాదు. ఇప్పుడే రియలైజ్ చేస్తారు అంట. ఇప్పటిదాకా పార్టీ నాయకులు చెప్పింది ఫాలో అయ్యారు అంట, ఇప్పుడు ఆయన చెప్పింది ఫాలో అవ్వాలంటున్నారు. మొదటిది దేవుడికే తెలియాలి.
“వోటు చీలనివ్వను” అని ఈ నాయకులు చెప్పారు, ఈ కార్యకర్తలు చెప్పారు. ఏకపక్షంగా పొత్తు ప్రకటిస్తే ఇచ్చినన్ని సీట్లు తీసుకోవాల్సి వస్తుందని తెలియదా? ఇవన్నీ ఈ నాయకులు, కార్యకర్తలు చెప్పారా?
“నా మాట వినేవాడే నా వాడు”, “నేను చెప్పింది ఫాలో అవ్వమన్న” వ్యక్తి ఈ రోజు మళ్లీ “మీరు చెప్పింది ఫాలో అయ్యాం” అనడం పెద్ద అబద్ధం. ఈ విషయంలో ఏం ఫాలో అయ్యారో?
“మీ మాట విని 2019లో ఒంటరిగా వెళ్లాను గా, ఏమైంది?” అంటూ ఓటమిని కార్యకర్తలకు ఇచ్చే గొప్ప నాయకుడు. ఇప్పుడు కూడా “మీరు నన్ను 2019లో గెలిపించలేదు, నేను అన్ని రకాలుగా కరెక్ట్‌గా పార్టీని నడిపాను” అంటారు.
2014లో పార్టీ పెట్టినప్పటి నుంచి NDAకి సపోర్ట్ చేసి, వెళ్లి ఇంట్లో కూర్చున్నారు లేదంటే సినిమాలు చేసుకున్నారు. 5 ఏళ్లకు 4 సినిమాలు చేశారు. ఆ 4లో రెండు రీమేక్ సినిమాలు.
పోరాట యాత్ర, మిగతా మీటింగ్స్ కలిపితే ఒక 40–50 రోజులు. 4 సినిమాలు కలిపి ఒక 200 రోజులు పోతే, 2014 మే–జూన్ నుంచి 2018 చివరి వరకు 1650 రోజులు ఉంటే, ఒక 250 రోజులు సినిమాలు, పోరాట యాత్రకు పోయాయి. మిగిలిన 1400 రోజులు పార్టీ కోసం పని చేసి, పార్టీని బిల్డ్ చేసి ఉంటే 2019లో ఘోర ఓటమి ఉండేది కాదు.
నా లాంటి కల్ట్ అభిమాని (గుడ్డి అభిమాని కాదు) కూడా ట్వీట్ వేసి చెప్పాను. 2016 డిసెంబర్‌లోనే చెప్పాను. “చూశాం, ఈయన పార్టీ పెట్టి ఏదైనా చేస్తాడు” అని. పార్టీ పెట్టి 2014లో ప్రచారం చేసి, తర్వాత సినిమాలు, ఇంట్లో కూర్చుని ఆయనకి ఇష్టమైన పుస్తకాలు చదువుకున్నారు.
కొత్త రాజకీయ పార్టీలు విజయాలు సాధించాలంటే రకరకాల మార్గాలు ఉంటాయి. వాటిలో మొదటిది రాజకీయ శూన్యత ఉండటం. లేదంటే ఏదైనా పెద్ద పరిణామం జరగడం (రాష్ట్ర విభజన, పెద్ద నాయకులు, జయ/కరుణ లాంటి నాయకులు చనిపోవడం), లేదంటే రెండు పార్టీ నాయకత్వాలు అవుట్‌డేటెడ్ అవ్వడం.
స్ఫూర్తివంతమైన వ్యక్తులు, మంచి పేరు ఉన్న వాళ్లు ఈ సందర్భాల్లో పార్టీ పెడితే విజయాలు సాధించే అవకాశాలు ఎక్కువ.
JSPకి అలాంటి అవకాశమే 2014లో వచ్చింది. కానీ ఇక్కడ దురదృష్టం ఏంటంటే, ఒక పార్టీ పెట్టిన తర్వాత “మోస్ట్ కరప్ట్ పార్టీ”గా పేరు ఉన్న కాంగ్రెస్‌లో కలవడం వల్ల చాలా బ్యాగేజ్ వచ్చింది. అందులోనూ ఆ పార్టీలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి ఇలా చేయడం వల్ల, అలాంటి వ్యక్తి కొత్త పార్టీ పెడితే నమ్మడం, నమ్మి నడవడం చాలా కష్టం.
ఇలాంటి పరిస్థితుల్లో తమిళనాడులో విజయ్ TVKలా జరగడం అసాధ్యం. కాబట్టి 2014లో NDAకి సపోర్ట్ చేయడం మంచి నిర్ణయమే. PRPని మర్జ్ చేయకుండా సైలెంట్‌గా క్లోజ్ చేసి ఉన్నా ఇలా అయ్యేది కాదు.
మనకి విజయ్ లాంటి పరిస్థితి లేనప్పుడు రెండో మార్గం పార్టీని గ్రౌండ్‌లో నిర్మించి, కార్యకర్తలను తయారు చేసుకొని పని చేయడం. BJP లాంటి పార్టీ అన్ని రాష్ట్రాల్లో ఇదే పని చేస్తుంది.
2014 తర్వాత 10–15% ట్రాక్షన్ వచ్చినాక కూడా ఒకే పట్టుదలతో పని చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ ఎదగడం అనేది హార్డ్‌వర్క్ ద్వారానే అవుతుంది. సినిమాటిక్‌గా జరగదు.
మనం ఇవేవీ చేయకుండా నేరుగా 45 రోజుల సినిమా షెడ్యూల్‌లాగా యాత్ర చేసి, క్యాండిడేట్లను లాస్ట్ మినిట్‌లో SBI అప్లికేషన్ ఫారమ్‌లాగా తీసుకువచ్చి PR చేస్తే కష్టం కదా.
అలాంటి పోరాటానికి TVK లాంటి సినిమాటిక్ విజయం రాదు. తమిళనాడు, ఆంధ్ర రాజకీయ పరిస్థితులు వేరు కాదు. అదే కులం, డబ్బు, ఉచితాలు, మీడియా మాఫియా అన్నీ ఉన్నాయి.
ఒక్కటే తేడా — అక్కడ కొంత రాజకీయ శూన్యత (జయ గారి గైర్హాజరీ) వచ్చింది. దానికి తగ్గట్టు విజయ్ అనే వ్యక్తి 2–3 ఏళ్ల ముందే ప్రిపేర్ అయ్యి, ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్లను పెట్టుకుని (100 కోట్లు పెట్టి ఉండొచ్చు), జాగ్రత్తగా చేసుకున్నారు.
పైన చెప్పినట్టు JSP పార్టీ పెట్టిన పరిస్థితి, PRP గడిచిన చరిత్ర లాంటి విషయాల వల్ల పోల్చలేం. కానీ ఆంధ్ర, తమిళనాడు రాజకీయాలకు పెద్ద తేడా లేదు.
ప్రతి విజయం వేరు. పార్టీ బిల్డ్ చేసుకుంటూ, అవకాశం కోసం ఎదురు చూడాలి. మనకి అలాంటి అవకాశం 2019లో వచ్చింది.
2014 తర్వాత మనం పార్టీని బిల్డ్ చేయలేదు. 2018 వరకు ప్రజల్లో తిరగలేదు. అందుకే 2019లో ఘోర ఓటమి ఎదురైంది.
దీనికి కారణాలు ప్రజలు కాదు, కార్యకర్తలు కాదు, వోటు వేయని వర్గాలు కాదు. అది పార్టీ నాయకత్వం చేసిన తప్పులకు చెల్లించిన మూల్యం.
సొంతంగా పోటీ చేసిన స్థానాల్లో కూడా గట్టి పోలింగ్ ఏజెంట్లు లేరు అంటే ఎలా ప్రిపేర్ అయ్యారో అందరికీ తెలుసు.
ఈ ఓటమికి “నా సోమరితనం”, “నేను పార్టీ బిల్డ్ చేయకపోవడం” కారణం అని ఒప్పుకోకుండా కార్యకర్తలను, వర్గాలను, కులాన్ని, సినిమాలను, అందరినీ బ్లేమ్ చేసి 2024లో పొత్తు పెట్టుకోవడానికి వాడుకోవడం చాలా తప్పు.
పార్టీ ఎదిగే అవకాశం 2024లో వచ్చేది. కానీ మనం పార్టీ ఎదుగుదల కన్నా సేఫ్ బెట్ తీసుకున్నాం.
2019 ఓటమి అవమానాన్ని తీసుకుని నిలబడతాం అన్నారు. ఇప్పుడు అయినా దారిలోకి వస్తారు అనుకుంటే, 2019–2024...
2022 పార్టీ ఆవిర్భావ సభలో “వోటు చీలనివ్వను” అన్నప్పుడు, ఏ పార్టీ మీటింగ్‌లో డిస్కస్ చేశారు? ఈ తీర్మానం గురించి కార్యకర్తలు, ఇన్‌చార్జ్‌ల అభిప్రాయం ఏమైనా తీసుకున్నారా? లేదుకదా.
ఐడియాలజికల్ పార్టీ, డెమోక్రాటిక్ పార్టీ, డెమోక్రాటిక్ ప్రిన్సిపుల్స్ ఇవన్నీ చెప్పడం వరకే. పార్టీ కార్యకర్తల మనసు పట్టించుకోకుండా గుడ్డిగా నన్ను ఫాలో అవ్వమంటారు. దేశంలో ఉన్న డెమోక్రాటిక్ పార్టీలు, వాటి నాయకులు ఇలా “నన్ను నమ్మండి, గుడ్డిగా ఫాలో అవ్వండి” అంటున్నారా?
ఇలాంటివాటి గురించి అడిగితే “ఇది నా పార్టీ, నన్నే ప్రశ్నిస్తారా?” అంటారు. ఇది కళ్యాణ్ గారు పెట్టిన పార్టీయే, ఆయనకే ఎక్కువ అధికారాలు ఉండొచ్చు. కానీ కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు దాని పర్యవసానాలు ఆయనతో పాటు కష్టపడుతున్న ప్రతి నాయకుడు, కార్యకర్త భరించాలి.
కళ్యాణ్‌కి నష్టం జరిగితే ఆయన సీఎం అవ్వకపోవచ్చు, ఒక ఎమ్మెల్యే అవ్వకపోవచ్చు, లేదా అధికారం రాకపోవచ్చు. కానీ గ్రామంలో ఒక కార్యకర్తకి, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌కి జీవితం తలకిందులు అవుతుంది.
కళ్యాణ్ గారు హ్యాపీగా ఒక సినిమా చేసుకుని సంపాదించుకుని జీవితం గడిపేయగలరు. “రబ్బరు చెప్పులు వేసుకున్న వాళ్లు కావాలి”, “సొంత వ్యాపారాలు చేసుకుంటూ వాటిని కాపాడుకోవడానికి రాజకీయాలు వాడుకునేవాళ్లు కాదు” అన్నప్పుడు, చాలా మంది సామాన్యులు, చిన్న స్థాయిలో ఆదాయం ఉన్నవాళ్లు దీన్ని ఒక కెరీర్‌లా వస్తారు అని, వాళ్ల జీవితాలు మారిపోతాయి అని కూడా గుర్తుంచుకుని, వాళ్ల అభిప్రాయాలు, ఆలోచనలు తీసుకుంటూ ముందుకు నడిపితేనే నాయకుడు కరెక్ట్‌గా ఉన్నట్టు.
120 సెకండ్లలో ఏకపక్షంగా, ముందు వెనుక ఆలోచించకుండా, పార్టీ భవిష్యత్తు గురించి ఆలోచించకుండా, లెక్కలు లేకుండా పొత్తులు అనౌన్స్ చేస్తే నష్టపోయేది మీరు ఒక్కరే కాదు. పార్టీ లో ఉన్న అందరూ ఈ రోజు.
ఇలాంటి అవకాశాలు అన్నీ వదిలేసి, ఆవేశంగా నిర్ణయాలు తీసుకుని మంచి ఫలితాలు రాలేదు. పక్క రాష్ట్రంలో చాలా సుఖంగా సీఎం అయిపోయారు, నాకు అసూయ ఉంది అంటే — అక్కడ విజయ్‌కి ఉన్న పరిస్థితులకు అనుగుణంగా, ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ల ఫీడ్‌బ్యాక్ తీసుకుని, స్ట్రాటజీ ప్రకారం ఎలక్షన్ చేశారు. 2–3 ఏళ్లు వర్కౌట్ చేశారు.
విజయ్ వీక్‌నెస్ గుర్తించి, ఒక్క ఇంటర్వ్యూ కూడా ఇవ్వకుండా, దానికి అనుగుణంగా నడుచుకున్నారు. అలాంటి విధానాలను నేను సపోర్ట్ చేయను కానీ, వీక్‌నెస్ మీద అవగాహనతో ప్రవర్తించి నిర్ణయాలు తీసుకున్నాడు.
అమిత్ షా లాంటి ఎంతో మంది అనుభవజ్ఞులను మోదీ స్ట్రాటజిస్టులు, అడ్వైజర్లుగా తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు తీసుకున్నారు. జగన్ కూడా వాళ్ల మీదే ఆధారపడి రన్ చేయడం అందరికీ తెలిసిందే.
కానీ కొంతమంది జనసైనికుల ప్రకారం పవన్ కళ్యాణ్‌కి అన్నీ తెలుసు. ఆయన అసలు తప్పులు చేయరు. దేవుడు. ఆయనకి ఎవరి సలహాలు అవసరం లేదు. ఆయన ప్రపంచంలో ఉన్న అన్ని ఫిలాసఫీలు, చరిత్రలు చదివేశారు కాబట్టి.
ఒకవైపు “నాకు సీఎం అవ్వాలని లేదు”, “ఏ పదవుల కోసం రాలేదు” అంటారు. మరోవైపు “విజయ్ ఈజీగా సీఎం అయ్యారు” అంటారు.
అవును, విజయ్ ఈజీగానే సీఎం అయ్యారు. కానీ స్మార్ట్‌గా, తన వీక్‌నెస్‌ల మీద క్లారిటీతో ఉండి, తనకన్నా ఎక్కువ తెలిసిన వాళ్ల సహాయంతో స్మార్ట్‌గా ఆడి గెలిచారు.
ఆఫ్‌కోర్స్ ఇప్పుడు ఆయనకి రాజకీయ శూన్యతతో వచ్చిన అవకాశం కూడా ఉంది. అలాంటి అవకాశాలను మనం ఈ విధంగా ఉపయోగించుకుంటున్నాం.
పక్క పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు “నేను ఆ పార్టీ కష్టాలను వాడుకుని ఎదగాలి అనుకోవట్లేదు” అంటారు. జగన్ అరెస్ట్ అయ్యి, అక్కడ పరిస్థితులు వీక్‌గా ఉన్నప్పుడు ఎదగాలి అనుకోవట్లేదు. జగన్ బలంగా ఉన్నప్పుడే కొట్టి గెలుస్తా అంటారు.
అటు TDP/CBN వీక్‌గా ఉన్నప్పుడు కాదు, ఇటు జగన్/YCP వీక్‌గా ఉన్నప్పుడు కాదు అన్నప్పుడు రాజకీయ శూన్యత ఎలా వస్తుంది? మీకు ఎదిగే అవకాశం ఎలా వస్తుంది?
ఏదో అంటారు కదా — “అన్ని ఉన్నాయి, అల్లుడు నోట్లో శని” అని. మంచి తెలివితేటలు, ప్రపంచ జ్ఞానం, నీతి నిజాయితీ, ఎప్పుడూ అధికారం చూడని అతి పెద్ద వర్గానికి ఐకాన్‌గా ఉండటం, అన్ని కులాలు, మతాలకు మంచి వాడు అనే ముద్ర ఉండి కూడా, ఈ క్లారిటీ లేని రాజకీయ విధానాల వల్ల, బాబు గారిని పొగుడుకుంటూ, పార్టీ బిల్డ్ చేయకుండా ఎలా గెలుస్తారు?
“నన్ను నమ్మండి” అంటూ నెట్టుకుంటూ వచ్చేస్తున్నారు.
ప్రశాంత్ కిషోర్ ఒక ఇంటర్వ్యూలో చెబుతారు. ఒక వ్యక్తి అడుగుతారు — “ఇంత అనుభవం ఉన్న నాయకులు, ఎన్నో రకాల రాజకీయాలు చూసిన లీడర్లు నిన్ను ఎందుకు అపాయింట్ చేసుకుంటారు? వాళ్లకి తెలియనిది నీకు ఏమి తెలుసు?” అని అడిగితే,
ప్రశాంత్ కిషోర్ అంటారు — ఈ రాజకీయ పార్టీలు, నాయకులకు, ముఖ్యంగా పై స్థాయిలో ఉన్న నాయకుల చుట్టూ భజన బృందం చేరుతుంది. ఆ పార్టీ అధినాయకులు ఏది చెప్తే అదే కరెక్ట్ అన్నట్టు బిహేవ్ చేస్తారు. గ్రౌండ్ ఫీడ్‌బ్యాక్ కరెక్ట్‌గా ఇవ్వరు, లేదంటే చేరనివ్వరు.
నేను మొహమాటం లేకుండా వాళ్ల ఆలోచనలు, పనులు, వాళ్ల మీద ప్రజలు అనుకునే చెడు నిజాలను వాళ్లకే ధైర్యంగా చెప్తాను. అప్పుడు వాళ్లు దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి నేను సహాయపడతాను అంటారు.
శల్య సారథ్యం ఉండకూడదు, ఒప్పుకుంటాను. అలాగని పూర్ ఇంటెలెక్ట్యువల్స్‌తో సినిమా భజన బృందం, ఉన్న కొంత తెలివైన వాళ్లు కూడా నాయకుడ్ని ఎలాగైనా, ఏమైనా డిఫెండ్ చేయడానికి ఆ తెలివితేటలు వాడేవాళ్లు ఉంటే ఫలితాలు కరెక్ట్‌గా రావు.
2019 ఓటమిని కరెక్ట్‌గా అనాలైజ్ చేయలేదు. అది చేయక మరికొన్ని తప్పులు చేశారు. టెంపరరీగా దాని ఫలితాలు బాగున్నా, పార్టీకి దీర్ఘకాలంలో సరైన చర్యలు తీసుకోకపోతే చాలా నష్టపోతారు.
అంటే ఏంటి అంటే, రాజకీయ పార్టీలకు, అదీ ఎదగాలనుకుంటున్న JSP లాంటి రాజకీయ పార్టీలకు ఈ వందిమాగధులు చేసే డ్యామేజ్ అంతా ఇంతా కాదు. వాళ్లని ఎంటర్‌టైన్ చేసే నాయకులు కూడా.
అజిత్ దోవల్ అంటారు — “If you can't define problem correctly, you will never find a right solution or solve that problem.”
రే డాలియో అనే హెడ్జెఫండ్ మేనేజర్, తన ఆలోచనలు తో, అదేలా ఆలోచించే మేధావుల బృందంతో చాలా నష్టపోయాక, చుట్టూ క్రిటిక్స్‌తో నింపుకుని, ఆయన ఆలోచనలకు భిన్నంగా, ధైర్యంగా డిసఅగ్రి చేసే ఇంటెలెక్ట్యువల్స్‌ని పెట్టుకుని రే డాలియో అనే హెజ్ ఫండ్ మేనేజర్ ప్రపంచంలోనే టాప్ 20 హెజ్ ఫండ్ మేనేజర్లలో ఒకరిగా, ఇంటెలెక్ట్యువల్‌గా పేరు పొందాడు.
ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్, స్ట్రాటజిక్ కమ్యూనిటీ కూడా ఇలాంటి విధానాన్నే ఫాలో అవుతాయి.
ఒక ఉద్యమం, ఒక సంస్థ, ఒక రాజకీయ పార్టీ నడిపేటప్పుడు ఆ కార్యకర్తలు ఆలోచనలు, మనసు ప్రతిబింబించాలి. కాకపోతే ఇక్కడ పవన్ కన్నా ఎక్కువ పాపులర్, చరిష్మటిక్ లీడర్ JSPలో లేదు కాబట్టి, ముంచినా, తేల్చినా పవన్ కళ్యాణ్ ఏ కదా. ఇలాంటి సందర్భంలో ఆయన తప్పులు జరగకుండా లేదా తక్కువ తప్పులు జరిగే విధంగా ఉండే విధానాలు అలవర్చివడం చాలా ముఖ్యం.
యూదుల సంప్రదాయంలో, ఇజ్రాయెల్ సంస్కృతిలో “మఖ్లోకేత్ ల్’షేమ్ షమయిమ్” అనే భావన ఉంది. దాని అర్థం — “స్వర్గం కోసం చేసే భిన్నాభిప్రాయం”.
అంటే వాదనను గెలవాల్సిన ఘర్షణగా కాదు, అన్ని కోణాలు పరిశీలించి ఉత్తమ నిర్ణయం తీసుకోవడానికి ఉపయోగించే పవిత్ర సాధనంగా చూస్తారు.
JSP అధినాయకత్వం ఎప్పుడు అయితే ఈ ప్రజాస్వామ్య సూత్రాలతో పాటు, ఎప్పటికప్పుడు కార్యకర్తల మనసు తెలుసుకుంటూ, “నాకు అన్నీ తెలుసు” అని ఊరుకుంటే సరిపోదు అని గుర్తించి, వివిధంగా ఆలోచించే మేధోసంపత్తితో, 365 రోజులు ప్రజల్లో ఉంటూ, పార్టీ నిర్మాణం చేసుకుని పని చేస్తే, జనసేన పార్టీని ఆపే శక్తి ఏదీ లేదు.
పంచుకోండి
వ్యాఖ్యలు
ఒక్కసారి ఇమెయిల్ ధృవీకరణ అవసరం. ఆమోదించిన వ్యాఖ్యలు మాత్రమే కనిపిస్తాయి; ఇమెయిల్ చిరునామాలు కనిపించవు.
ఇంకా ఆమోదించిన వ్యాఖ్యలు లేవు.