లింగమనేని రమేష్‌కు జనసేన పార్టీ రాజ్యసభ ఇవ్వడాన్ని ఎలా చూడాలి?
జనసేనకు వచ్చిన రాజ్యసభ సీటును లింగమనేని రమేష్‌కు ఇవ్వడంపై, పార్టీ విలువలు, ప్రజా సందేశం, TDP అనుబంధం చుట్టూ ఒక వ్యక్తిగత విశ్లేషణ.

జనసేన పార్టీ అధినేత ఆ మధ్యలో, “మన ఎంపీలు వ్యాపారవేత్తలు. వాళ్లు అంతా ఢిల్లీ వెళ్లి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కంటే, వాళ్ల కాంట్రాక్టులు, వ్యాపారాలు చూసుకుంటున్నారు” అని అన్నారు. డబ్బున్న వాళ్లకే రాజ్యసభ సీట్లా? అని పవన్ కళ్యాణ్ గారు గతంలో విమర్శించిన విషయం ఇక్కడ గమనార్హం.
జనసేన తరఫున రాజ్యసభకు లింగమనేని రమేష్ గారిని నామినేట్ చేసినట్లు ప్రకటించారు. జనసేన కోసం ఆయన ఏమి చేశారో, మంచి చేశారో, చెడు చేశారో ఎవరికీ పెద్దగా తెలియదు. ఒకవేళ ఏమైనా చేసి ఉంటే, బాబు గారి ద్వారా కమ్యూనికేట్ చేయడం లేదా పార్టీకి నిధులు ఇవ్వడం చేసి ఉండొచ్చని అనుకోవచ్చు.
ఇది ఇప్పుడు ఎందుకు పార్టీకి చాలా నెగటివ్ PR లాగ కనిపిస్తుందంటే, లింగమనేని గారు జనసేనకు నిధులు ఇచ్చినట్లు కూడా పబ్లిక్ లో రికార్డులు లేవు. ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా కానీ, బయట నేరుగా కానీ ఇచ్చినట్లు నేను చూడలేదు. ఉంటే నేను కూడా తెలుసుకుంటా. ఆయన బాబు గారికి చాలా కాలంగా సన్నిహితుడు. అమరావతిలో బాబు గారు కూడా లింగమనేని గారికి చెందిన ఇంట్లోనే చాలా కాలంగా ఉంటున్నారు. బాబు గారికి, కళ్యాణ్ గారికి మధ్య ఆయన ఒక అనుసంధానకర్త అని వినికిడి.
జనసేనకు వచ్చిన ఒక్కగానొక్క రాజ్యసభ సీటును, పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడిన వారికి, లేదా భవిష్యత్తులో పార్టీకి మరింత ఉపయోగపడతారని భావించిన వారికి (డబ్బు పరంగా కాదు), వెనుకబడిన వర్గాల నుంచి వచ్చిన పార్టీ కార్యకర్తలకు, లేదా మంచి విద్యావంతులు, ఎన్నికల్లో గెలవకపోయినా పార్టీకి మేధోపరంగా ఉపయోగపడే వ్యక్తులకు ఇచ్చి ఉంటే బాగుండేది.
మొన్న దాసరి రాము మీద విమర్శలు వచ్చిన సమయంలోనే, ముందుగానే లింగమనేనిని వెనకేసుకొచ్చారు. ఎందుకంటే ఏమి చేయబోతున్నారో పవన్ కళ్యాణ్ గారికి తెలుసు కాబట్టి. దీనిపై విమర్శలు రాకూడదనే ఉద్దేశంతో, 2029 లోపు మరో 2 లేదా 3 రాజ్యసభ సీట్లు వస్తాయని వార్తలు కూడా వదిలారు. ఆ 2-3 సీట్లు కూడా బాబు గారికి లేదా TDPకి సన్నిహితులకే ఇస్తే ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉండదు.
2018-2019లో లింగమనేని గారు కళ్యాణ్ గారి వెనుక నిలబడ్డారు, TDPకి వ్యతిరేకంగా ఉన్నా కూడా ఆయన కళ్యాణ్ గారికి అండగా ఉన్నారు అని అంటారు. కానీ అది అంత గొప్ప కారణంగా నాకు అనిపించదు. 2019లో TDPకి వ్యతిరేకంగా ఉంటేనే వ్యతిరేక ఓటు చీలిపోయి, TDP మళ్లీ అధికారంలోకి వస్తుందని అప్పట్లో వచ్చిన ఆరోపణ అందరికీ తెలిసిందే. కాబట్టి ఆ సమయంలో TDPకి వ్యతిరేకంగా ఉన్నా కూడా నాకు అండగా ఉండటం నా దృష్టిలో అర్హత కాదు.
స్థానిక ఎన్నికల్లో 40% సీట్ల కోసం ఆయన పట్టుబట్టి జనసేనకు సాధించి పెట్టారు అంటే, అప్పుడు ఆయన నిజంగా జనసేన కోసమే ఉన్నారని, TDP కోసం కాదని అనుకోవచ్చు. వ్యాపారవేత్తలు అన్ని పార్టీలకూ నిధులు ఇవ్వడం సహజమే. కానీ ఆయన 100, 200 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చినట్లు నాకు సమాచారం లేదు.
ఇప్పటికే “పవన్ కళ్యాణ్ గారు TDP కోసమే ఉన్నారు” అనే అభిప్రాయానికి ఈ నిర్ణయం మరింత బలం చేకూర్చడం తప్ప ఇంకే ప్రయోజనం కనిపించడం లేదు. కేంద్ర పెద్దలతో సంబంధాలు నిర్వహించడానికి, పవన్ కళ్యాణ్ గారికి సన్నిహితంగా ఉండి పార్టీ కోసం పనిచేసే ఒక్క వ్యక్తి కూడా లేరా? టి. శివశంకర్ లాంటి వ్యక్తులను ఎందుకు పంపకూడదు? ఆయనకు APMSME DC పదవి ఇచ్చారు కాబట్టి రాజ్యసభ ఇవ్వకూడదా? ఆ పదవి ఇంకొకరికి కూడా ఇవ్వవచ్చు కదా. లేదా అలాంటి ఇంకొకరిని పంపొచ్చు.
కొంతమంది TDP, YCP నాయకులు గతంలో డబ్బున్న అభ్యర్థులకు రాజ్యసభ సీట్లు ఇవ్వడాన్ని చూపిస్తూ దీనిని సమర్థించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇదే అసలైన ఉచ్చు. జనసేన కూడా పార్టీలకు నిధులు ఇచ్చిన వారికి, YCP, TDP ల్లాగే పదవులు ఇస్తుందా? అనే ప్రశ్న వస్తుంది. ఈ వాదన జనసేన రాజకీయ సిద్ధాంతం, విలువలపై సందేహాన్ని కలిగిస్తుంది. “మేమూ అలాగే చేస్తాం, వాళ్లూ మేమూ ఒకటే” అన్న స్థితికి వస్తే, ఇక చర్చించడానికి పెద్దగా ఏమీ లేదు.
అప్పుడు డబ్బున్న వారికి రాజ్యసభ సీట్లు ఇవ్వడంలో YCP, TDP, జనసేన మధ్య పెద్ద తేడా లేదనే నిర్ణయానికి రావాల్సి ఉంటుంది. దానితో పాటు TDP కోసం, TDP మనుషులకే జనసేనలో కూడా స్థానం ఉందనే సందేశం మరింత గట్టిగా వెళ్తుంది.
జై హింద్
Raj Pattem
పంచుకోండి
వ్యాఖ్యలు
ఒక్కసారి ఇమెయిల్ ధృవీకరణ అవసరం. ఆమోదించిన వ్యాఖ్యలు మాత్రమే కనిపిస్తాయి; ఇమెయిల్ చిరునామాలు కనిపించవు.
ఇంకా ఆమోదించిన వ్యాఖ్యలు లేవు.