వ్యాసాలు

జనసేన పార్టీ, TVK తో పోలిక, తమిళనాడు రాజకీయాలపై పవన్ కళ్యాణ్ ప్రసంగంపై విశ్లేషణ

జోసెఫ్ విజయ్ రాజకీయ విజయం, తమిళనాడు పరిస్థితులు, జనసేన పార్టీ నిర్మాణం, పవన్ కళ్యాణ్ నిర్ణయాల మీద విశ్లేషణ.

Raj Pattem@pattem_raj
9 నిమిషాల చదువు
రాజకీయాలుజనసేనపవన్ కళ్యాణ్విజయ్తమిళనాడురాజకీయాలు

కొత్త రాజకీయ పార్టీలు ఎలా విజయం సాధిస్తాయి

ఏ కొత్త రాజకీయ పార్టీ విజయాన్ని అర్థం చేసుకోవాలన్నా ముందుగా రాజకీయ పార్టీలు ఎలా ఎదుగుతాయో అర్థం చేసుకోవాలి. సాధారణంగా కొత్త రాజకీయ పార్టీలు మూడు పరిస్థితుల్లో ఎదుగుతాయి.

మొదటిది రాజకీయ శూన్యత. రాష్ట్ర విభజన, పెద్ద నాయకుల మరణం, పాత రాజకీయ వ్యవస్థల పతనం వంటి పరిణామాలు కొత్త రాజకీయ శక్తులకు అవకాశం కల్పిస్తాయి.

రెండవది, రెండు ప్రధాన రాజకీయ పార్టీలు కాలానికి అనుగుణంగా మారకపోవడం. ప్రజల్లో అసంతృప్తి పెరిగినప్పుడు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తులకు అవకాశం లభిస్తుంది.

మూడవది, దీర్ఘకాలిక పార్టీ నిర్మాణం. కార్యకర్తల తయారీ, గ్రామ స్థాయి నిర్మాణం, ప్రజల్లో నిరంతర ఉనికి ద్వారా రాజకీయ బలం పెంచుకోవడం.

ప్రజాదరణ ఉన్న వ్యక్తిత్వానికి రాజకీయ శూన్యత కూడా తోడైతే అది రాజకీయ అగ్నిపర్వతంగా మారుతుంది. అలాంటి సందర్భాల్లో కొత్త పార్టీలు వేగంగా ఎదగగలవు.

2014లో JSPకి వచ్చిన అవకాశం

జనసేనకు 2014లో ఒక ప్రత్యేక అవకాశం లభించింది. అయితే ఇక్కడ 2009 గత చరిత్ర పరిమితి కూడా ఉంది. 2009లో ఒక రాజకీయ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన చరిత్ర ప్రజల మదిలో ఇంకా ఉంది. అలాంటి చరిత్ర తర్వాత అదే రాజకీయ వర్గానికి, కుటుంబానికి, ఆ పార్టీలో భాగస్వామ్యం ఉన్న వ్యక్తి కొత్త పార్టీ ప్రారంభిస్తే ప్రజలు వెంటనే నమ్ముతారని అనుకోవడం వాస్తవికత కాదు. అందువల్ల 2014లో తమిళనాడులో TVKకి లభించిన తరహా పరిస్థితి జనసేనకు లేదు.

ఈ కోణంలో చూస్తే 2014లో NDAకి మద్దతు ఇవ్వడం తప్పు నిర్ణయం కాదు. ఆ సమయంలో అది ఒక వ్యూహాత్మక నిర్ణయంగా కూడా చూడవచ్చు. కానీ సమస్య అక్కడ లేదు. సమస్య అంతా 2014 ఎన్నికల తర్వాత ఏమీ చేయకుండా ఎందుకు ఉన్నాం అనే దాని వల్లే వచ్చింది. ఎందుకంటే TVKకి అందివచ్చిన రాజకీయ శూన్యత, గతం లేని చరిత్ర వంటి పరిస్థితి లేకపోతే ప్రత్యామ్నాయం ఒక్కటే — పార్టీ నిర్మాణం.

కార్యకర్తలను తయారు చేయాలి. గ్రామ స్థాయిలో నిర్మాణం ఉండాలి. స్థానిక నాయకత్వాన్ని పెంచాలి. నిరంతర ప్రజా సంబంధాలు ఉండాలి. ప్రజల్లో పార్టీ నిరంతరం ఉనికి కనిపించాలి. ఇది సినిమాటిక్‌గా జరగదు. BJP లాంటి పార్టీ కొత్తగా ఎదిగే అన్ని రాష్ట్రాల్లో ఇదే పని చేస్తుంది.

2014–2019 మధ్య పార్టీ నిర్మాణ వైఫల్యం, 2019 ఓటమి ఎందుకు జరిగింది

2014లో పార్టీ స్థాపించిన తర్వాత 2019 వరకు ఉన్న కాలాన్ని పరిశీలిస్తే ఒక ప్రశ్న తప్పనిసరిగా ఎదురవుతుంది — ఈ ఐదు సంవత్సరాల్లో పార్టీ నిర్మాణానికి ఎంత సమయం కేటాయించబడింది?

ప్రతి రాజకీయ పార్టీ విజయం ప్రత్యేక పరిస్థితులతో కలిసి ఉంటుంది. పార్టీ బిల్డ్ చేసుకుంటూ, అవకాశం కోసం ఎదురు చూడాలి. JSPకి అలాంటి అవకాశం 2019లో వచ్చింది.

2014లో పార్టీ పెట్టినప్పటి నుంచి NDAకి సపోర్ట్ చేసి, వెళ్లి ఇంట్లో కూర్చున్నారు లేదంటే సినిమాలు చేసుకున్నారు. 5 ఏళ్లకు 4 సినిమాలు చేశారు, ఆ నాలుగులో రెండు రీమేక్ సినిమాలు. పోరాట యాత్ర, మిగతా మీటింగ్స్ కలిపితే ఒక 40–50 రోజులు. 4 సినిమాలు కలిపి ఒక 200 రోజులు పోతే, 2014 మే–జూన్ నుంచి 2018 చివరి వరకు 1650 రోజులు ఉంటే, ఒక 250 రోజులు సినిమాలు, పోరాట యాత్రకు పోయాయి. మిగిలిన 1400 రోజుల కాలంలో పార్టీ నిర్మాణం, కేడర్ అభివృద్ధి, స్థానిక నాయకత్వం తయారీ, బూత్ స్థాయి సంస్థాగత బలం పెంపు వంటి అంశాల్లో దృష్టి పెట్టి ఉంటే 2019లో ఘోర ఓటమి ఉండేది కాదు.

ఆ సమయంలోనే చాలా మంది అభిమానులు, పరిశీలకులు ఈ విషయాన్ని ప్రస్తావించారు. (https://x.com/pattem_raj/status/809653272331980801)

RaiPattem tweet from Dec 16, 2016 about Pawan Kalyan and village issues

ఇవేవీ చేయకుండా నేరుగా 45 రోజుల సినిమా షెడ్యూల్‌లాగా యాత్ర చేసి, క్యాండిడేట్లను లాస్ట్ మినిట్‌లో SBI అప్లికేషన్ ఫారమ్‌లాగా తీసుకువచ్చి PR చేస్తే కష్టం కదా. అలాంటి 2019 ఓటమికి కార్యకర్తల్ని, ఓటర్లని పదే పదే బాధ్యుల్ని చెయ్యడం ఎంతవరకు సబబు? పార్టీ అధ్యక్షుడు పోటీ చేసిన స్థానాల్లో కూడా గట్టి అనుభవం ఉన్న బూత్ ఏజెంట్లు లేరు అంటే ఎలా ప్రిపేర్ అయ్యారో అందరికీ తెలుసు.

నిరంతరం ప్రజల్లో ఉంటూ పార్టీ నిర్మాణం చేసుకొని ఉపయోగించుకొని ఉంటే, 2019లో ఫలితం వేరే విధంగా వచ్చేది.

కార్యకర్తల్ని, ఓటర్లని నిందించడం ఎందుకు తప్పు

ప్రయత్న లోపం పెట్టుకొని, జనాల్ని, అభిమానుల్ని, కులాల్ని నిందిస్తే అది సొంత తప్పుల నుండి తప్పించుకొనే ప్రయత్నమే. 2019 ఫలితాలపై పవన్ కళ్యాణ్ గారు చేసేది అదే.

2019కి కారణాలు ప్రజలు కాదు, కార్యకర్తలు కాదు, వోటు వేయని వర్గాలు కాదు. అది పార్టీ నాయకత్వం చేసిన తప్పులకు చెల్లించిన మూల్యం.

అజిత్ దోవల్ అంటారు — "If you can't define a problem correctly, you will never find the right solution or solve that problem." 2019 ఓటమిని సరిగ్గా విశ్లేషించలేదు. దాని నుంచి సరైన పాఠాలు నేర్చుకోకుండా ఇప్పటికీ అది ప్రజల తప్పు అన్నట్టు మాట్లాడుతున్నారు. ఆ ఓటమి నుండి నేర్చుకొన్నది ఏమైనా వున్నది ఉంటె నాకు తెలిసీ, ఏకపక్షంగా, షరతులు లేని పొత్తుకు వెళ్లాలనుకోవడం మాత్రమే. తాత్కాలికంగా దాని ఫలితాలు పర్లేదు అనిపించినా, దీర్ఘకాలంలో సరైన చర్యలు తీసుకోకపోతే పార్టీ చాలా నష్టపోతుందని అందరికీ తెలుసు.

నిరంతరం ప్రజల్లో ఉండకుండా, పార్టీ నిర్మాణం చెయ్యకుండా ఉండటం కారణం అని ఒప్పుకోకుండా కార్యకర్తలను, వర్గాలను, కులాన్ని అందరినీ నిందిస్తూ 2024లో పొత్తు పెట్టుకోవడానికి వాడుకోవడం చాలా తప్పు.

"2007 నుంచి వెయిట్ చేస్తున్నాం", "సాధక్" లాంటి పార్టీ వ్యవస్థతో కూడిన నిర్మాణం చేయటానికి అంటారు. ఇప్పుడే రియలైజ్ చేస్తారు అంట. ఇప్పటిదాకా పార్టీ నాయకులు చెప్పింది ఫాలో అయ్యారు అంట, ఇప్పుడు ఆయన చెప్పింది ఫాలో అవ్వాలంటున్నారు. మొదటిది ఎప్పుడు జరిగిందో, ఏ నాయకులు చెప్పింది ఫాలో అయ్యారో దేవుడికే తెలియాలి.

"వోటు చీలనివ్వను" అని ఏ నాయకులు చెప్పారు, ఏ కార్యకర్తలు చెప్పారు? "నా మాట వినేవాడే నా వాడు", "నేను చెప్పింది ఫాలో అవ్వమన్న" వ్యక్తి ఈ రోజు మళ్లీ "మీరు చెప్పింది ఫాలో అయ్యాం" అనడం పెద్ద అబద్ధం.

"మీ మాట విని 2019లో ఒంటరిగా వెళ్లాను గా, ఏమైంది?" అంటూ ఓటమిని కార్యకర్తలకు ఇచ్చే గొప్ప నాయకుడు. ఇప్పుడు కూడా "మీరు నన్ను 2019లో గెలిపించలేదు, నేను అన్ని రకాలుగా కరెక్ట్‌గా పార్టీని నడిపాను" అంటారు. పార్టీ నిర్ణయాలు నాయకత్వం తీసుకుంటే ఫలితాలకు బాధ్యత కూడా నాయకత్వానిదే కావాలి.

అంతర్గత ప్రజాస్వామ్యం, నిర్ణయాధికారం

2022 పార్టీ ఆవిర్భావ సభలో "వోటు చీలనివ్వను" అన్నప్పుడు, ఏ పార్టీ మీటింగ్‌లో డిస్కస్ చేశారు? ఈ తీర్మానం గురించి కార్యకర్తలు, ఇన్‌చార్జ్‌ల అభిప్రాయం ఏమైనా తీసుకున్నారా? అటువంటి నిర్ణయాలు ముందుగా ప్రకటించబడినప్పుడు వాటి దీర్ఘకాలిక రాజకీయ పరిణామాలు ఏమవుతాయో చర్చ జరిగిందా అనే ప్రశ్న సహజంగా వస్తుంది. 2024 పొత్తు కోసం, 2022లోనే నిర్ణయం తీసుకుని, అందరినీ ప్రిపేర్ చేయడానికి అన్ని రకాల స్క్రిప్ట్‌లు రన్ చేసుకున్నారు.

ఐడియాలజికల్ పార్టీ, డెమోక్రాటిక్ పార్టీ, డెమోక్రాటిక్ ప్రిన్సిపుల్స్ — ఇవన్నీ చెప్పడం వరకే. పార్టీ కార్యకర్తల మనసు పట్టించుకోకుండా గుడ్డిగా నన్ను ఫాలో అవ్వమంటారు. దేశంలో ఉన్న డెమోక్రాటిక్ పార్టీలు, వాటి నాయకులు ఇలా "నన్ను నమ్మండి, గుడ్డిగా ఫాలో అవ్వండి" అంటున్నారా? ఒకవేళ ఎవరైనా అలా నమ్ముతుంటే, ఆ నాయకత్వం కల్పించిన నమ్మకం అటువంటిది అనుకోవాలి. అలాంటి నమ్మకం మనం ఎందుకు కల్పించలేకపోయాం అని ఒకసారైనా ఆత్మ విమర్శ చేసుకోవాలి. అంతే కానీ, "గుడ్డిగా నమ్మండి, నన్ను ప్రశ్నిస్తే నా వాడు కాదు" అనే భాష నియంతల భాష.

ఇలాంటివాటి గురించి విమర్శిస్తే "ఇది నా పార్టీ, నన్నే ప్రశ్నిస్తారా?" అంటారు. ఇది కళ్యాణ్ గారు పెట్టిన పార్టీయే, ఆయనకే ఎక్కువ అధికారాలు ఉండొచ్చు. కానీ కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు దాని పర్యవసానాలు ఆయనతో పాటు కష్టపడుతున్న ప్రతి నాయకుడు, కార్యకర్త భరించాలి.

కళ్యాణ్‌కి నష్టం జరిగితే ఆయన సీఎం అవ్వకపోవచ్చు, ఒక ఎమ్మెల్యే అవ్వకపోవచ్చు, లేదా అధికారం రాకపోవచ్చు. కానీ గ్రామంలో ఒక కార్యకర్తకి, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌కి జీవితం తలకిందులు అవుతుంది. PRP కాంగ్రెస్‌లో కలిపేసినప్పుడు, చిన్న నాయకులు, కార్యకర్తలు రెండు పార్టీల మధ్య ఎలా నష్టపోయారో వాళ్లకే తెలుసు.

కళ్యాణ్ గారు హ్యాపీగా ఒక సినిమా చేసుకుని సంపాదించుకుని జీవితం గడిపేయగలరు. "రబ్బరు చెప్పులు వేసుకున్న వాళ్లు కావాలి", "సొంత వ్యాపారాలు చేసుకుంటూ వాటిని కాపాడుకోవడానికి రాజకీయాలు వాడుకునేవాళ్లు కాదు" అన్నప్పుడు — చాలా మంది సామాన్యులు, చిన్న స్థాయిలో ఆదాయం ఉన్నవాళ్లు దీన్ని ఒక కెరీర్‌లా వస్తారని, తేడా జరిగితే వాళ్ల జీవితాలు తలకిందులు అయిపోతాయని కూడా గుర్తుంచుకుని, వాళ్ల అభిప్రాయాలు, ఆలోచనలు తీసుకుంటూ ముందుకు నడిపితేనే నాయకుడు పదికాలాల పాటు ప్రజా మన్నన, కార్యకర్తల మెప్పు పొందుతారు.

120 సెకండ్లలో ఏకపక్షంగా, ముందు వెనుక ఆలోచించకుండా, పార్టీ భవిష్యత్తు గురించి ఆలోచించకుండా, లెక్కలు లేకుండా పొత్తులు అనౌన్స్ చేస్తే నష్టపోయేది నాయకుడు ఒక్కరే కాదు — పార్టీలో ఉన్న అందరూ నష్టపోతారు. ఏకపక్షంగా పొత్తు ప్రకటిస్తే ఇచ్చినన్ని సీట్లు తీసుకోవాల్సి వస్తుందని తెలియదా? అలాంటి నిర్ణయాలు ఒక వ్యక్తి అభిప్రాయంగా కాకుండా, ఒక సంస్థ నిర్ణయంగా రావాలి.

రాజకీయ అవకాశాలు — JSP, TVK పోలిక

అలాంటి ప్రయత్నానికి TVK లాంటి సినిమాటిక్ విజయం రాదు. తమిళనాడు, ఆంధ్ర రాజకీయ పరిస్థితులు వేరు కాదు. అదే కులం, డబ్బు, ఉచితాలు, రాజకీయ మీడియా మాఫియా లాంటివి అన్నీ ఉన్నాయి. తమిళనాడులో కులాల మీదే ఎన్నో పార్టీలు కూడా ఉన్నాయి.

ఒక్కటే తేడా — అక్కడ కొంత రాజకీయ శూన్యత వచ్చింది (జయ/కరుణ గారి గైర్హాజరీ). దానికి తగ్గట్టు విజయ్ అనే వ్యక్తి 2–3 ఏళ్ల ముందే ప్రిపేర్ అయ్యి, ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్లను పెట్టుకుని జాగ్రత్తగా చేసుకున్నారు.

JSP పార్టీ పెట్టిన పరిస్థితిని, PRP గత చరిత్ర లాంటి విషయాల వల్ల, ఆంధ్ర-తమిళనాడులను పోల్చలేం. కానీ ఆంధ్ర, తమిళనాడులలో జరిగే రాజకీయాలకు పెద్ద తేడా లేదు.

పరిస్థితులు బాగోలేనప్పుడే కొత్త పార్టీలకు అవకాశాలు ఉంటాయి. అన్నీ పరిస్థితులు బాగుంటే కొత్త పార్టీకి అవకాశం ఎందుకు ఇవ్వాలి అనుకుంటారు?

ఆయనకి రాజకీయ శూన్యతతో వచ్చిన అవకాశం వాస్తవమే అయినా, అలాంటి అవకాశాలను మనం ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాం? ఉపయోగించుకోవాలి అనే ఆలోచన ఉందా అసలు?

పక్క పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు "నేను ఆ పార్టీ కష్టాలను వాడుకుని ఎదగాలి అనుకోవట్లేదు" అంటారు. ఇప్పుడు జగన్ అరెస్ట్ అయ్యి, అక్కడ పరిస్థితులు బలహీనంగా ఉన్నప్పుడు ఎదగాలి అనుకోవట్లేదు; జగన్ బలంగా ఉన్నప్పుడే కొట్టి గెలుస్తా అంటారు. అటు TDP/CBN బలహీనంగా ఉన్నప్పుడు కాదు, ఇటు జగన్/YCP బలహీనంగా ఉన్నప్పుడు కాదు అన్నప్పుడు రాజకీయ శూన్యత ఎలా వస్తుంది? మీకు ఎదిగే అవకాశం ఎలా వస్తుంది?

పార్టీ ఎదిగే అవకాశం 2024లో వచ్చేది. కానీ మనం పార్టీ ఎదుగుదల కన్నా సేఫ్ బెట్ తీసుకున్నాం.

ఒకవైపు "నాకు సీఎం అవ్వాలని లేదు", "ఏ పదవుల కోసం రాలేదు" అంటారు; మరోవైపు "విజయ్ ఈజీగా సీఎం అయ్యారు, అసూయగా ఉంది" అంటారు. అవును, విజయ్ ఈజీగానే సీఎం అయ్యారు. కానీ స్మార్ట్‌గా, తన బలహీనతల మీద స్పష్టతతో ఉండి, తనకన్నా ఎక్కువ తెలిసిన వాళ్ల సహాయంతో తెలివిగా ఆడి గెలిచారు. అక్కడ విజయ్‌కి ఉన్న పరిస్థితులకు అనుగుణంగా, ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ల ఫీడ్‌బ్యాక్ తీసుకుని, స్ట్రాటజీ ప్రకారం 2–3 ఏళ్లు వర్కౌట్ చేసి ఎలక్షన్ చేశారు.

"అన్నీ ఉన్నాయి, అల్లుడు నోట్లో శని" అన్నట్టు — మంచి తెలివితేటలు, ప్రపంచ జ్ఞానం, నీతి నిజాయితీ, ఎప్పుడూ అధికారం చూడని అతి పెద్ద వర్గానికి ఐకాన్‌గా ఉండటం, అన్ని కులాలు, మతాలకు మంచి వాడు అనే ముద్ర ఉండి కూడా, ఈ స్పష్టత లేని రాజకీయ విధానాల వల్ల, బాబు గారిని పొగుడుకుంటూ, పార్టీ బిల్డ్ చేయకుండా ఎలా గెలుస్తారు?

బలమైన నాయకులకు విమర్శ, సలహాదారులు ఎందుకు అవసరం

విజయ్ తన బలహీనతలు గుర్తించి, ఒక్క ఇంటర్వ్యూ కూడా ఇవ్వకుండా, దానికి అనుగుణంగా నడుచుకున్నారు. అలాంటి విధానాలను నేను సపోర్ట్ చేయను, కానీ ఆయన తన బలహీనతలు గుర్తించి, అవగాహనతో ప్రవర్తించి, సలహాదారుల సహాయంతో నిర్ణయాలు తీసుకున్నాడు — అది తెలివైన మార్గం.

మోదీ, అమిత్ షా, చంద్రబాబు నాయుడు లాంటి అనుభవజ్ఞులు కూడా ఎంతో మంది వ్యూహకర్తలు, సలహాదారులను తీసుకున్నారు. జగన్ కూడా వాళ్ల మీదే ఆధారపడి పార్టీని నడపడం అందరికీ తెలిసిందే.

కానీ కొంతమంది జనసైనికుల ప్రకారం పవన్ కళ్యాణ్‌కి అన్నీ తెలుసు — ఆయన అసలు తప్పులు చేయరు, ప్రపంచంలో ఉన్న అన్ని తత్వశాస్త్రం, చరిత్రలు చదివేశారు, సామాజిక సమస్యలు తెలుసు, కాబట్టి ఆయనకి ఎవరి సలహాలు అవసరం లేదు.

ప్రశాంత్ కిషోర్ ఒక ఇంటర్వ్యూలో చెబుతారు. "ఇంత అనుభవం ఉన్న నాయకులు, ఎన్నో రకాల రాజకీయాలు చూసిన లీడర్లు నిన్ను ఎందుకు అపాయింట్ చేసుకుంటారు? వాళ్లకి తెలియనిది నీకు ఏమి తెలుసు?" అని అడిగితే, ప్రశాంత్ కిషోర్ అంటారు — "ఈ రాజకీయ పార్టీలు, నాయకులకు, ముఖ్యంగా పై స్థాయిలో ఉన్న నాయకుల చుట్టూ భజన బృందం చేరుతుంది. ఆ అధినాయకులు ఏది చెప్తే అదే కరెక్ట్ అన్నట్టు బిహేవ్ చేస్తారు. ఎందుకంటే నిజం చెప్పడం కంటే నాయకుడిని సంతోషపెట్టడం చాలా మందికి సులభంగా అనిపిస్తుంది. గ్రౌండ్ ఫీడ్‌బ్యాక్ కరెక్ట్‌గా ఇవ్వరు, లేదంటే నాయకులకు చేరనివ్వరు. నేను మొహమాటం లేకుండా వాళ్ల ఆలోచనలు, పనులు, వాళ్ల మీద ప్రజలు అనుకునే చెడు నిజాలను వాళ్లకే ధైర్యంగా చెప్తాను. అప్పుడు వాళ్లు దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి నేను సహాయపడతాను."

శల్య సారథ్యం ఉండకూడదు, ఒప్పుకుంటాను. అలాగని భజన బృందం, నాయకుడి ప్రతి నిర్ణయాన్ని సమర్థించే సంస్కృతి కూడా అంతే ప్రమాదకరం. నాయకుడ్ని సమర్థించుకోవాలి, అది అత్యవసరం కూడా. కానీ అన్నిట్లో గుడ్డిగా సమర్థించుకుంటూ పోతే కొద్దీ రోజులకి నష్టం జరిగాక కానీ తెలియదు; అప్పుడు మేలుకున్న ఉపయోగం ఉండకపోవచ్చు. నిజానికి రాజకీయాల్లో నాయకుడి శత్రువుల కంటే, అతిగా సమర్థించే అనుచరులే ఎక్కువ నష్టం చేసే సందర్భాలు ఉన్నాయి. ఎదగాలనుకుంటున్న JSP లాంటి పార్టీలకు ఈ వందిమాగధులు చేసే డ్యామేజ్ అంతా ఇంతా కాదు — వాళ్లని ఎంటర్‌టైన్ చేసే నాయకులు కూడా.

రే డాలియో (Ray Dalio) అనే హెడ్జ్ ఫండ్ మేనేజర్ స్టాక్ మార్కెట్ పెట్టుబడిలో చాలా నష్టపోయాక, చుట్టూ విమర్శనాత్మక ఆలోచనాపరులను నింపుకుని, తన ఆలోచనలకు భిన్నంగా ధైర్యంగా అసమ్మతి చెప్పే వాళ్లను పెట్టుకుని, ప్రపంచంలోనే టాప్ 20 హెడ్జ్ ఫండ్ మేనేజర్లలో ఒకరిగా, విజయవంతమైన పెట్టుబడిదారుడిగా పేరు పొందాడు.

ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్, స్ట్రాటజిక్ కమ్యూనిటీ కూడా ఇలాంటి విధానాన్నే ఫాలో అవుతాయి — ఒకే ఆలోచనా విధానం ప్రమాదకరమని వాళ్లు గుర్తించారు. యూదుల సంప్రదాయంలో, ఇజ్రాయెల్ సంస్కృతిలో "ఉన్నత లక్ష్యం కోసం చేసే భిన్నాభిప్రాయం" — అంటే వాదనను గెలవాల్సిన ఘర్షణగా కాదు, అన్ని కోణాలు పరిశీలించి ఉత్తమ నిర్ణయం తీసుకోవడానికి ఉపయోగించే పవిత్ర సాధనంగా చూస్తారు. ఈ భావన రాజకీయ పార్టీలకు కూడా వర్తిస్తుంది. ప్రశ్నించడం అంటే వ్యతిరేకించడం కాదు. విమర్శించడం అంటే ద్రోహం కాదు. భిన్నాభిప్రాయం అంటే శత్రుత్వం కాదు.

ముగింపు: జనసేన ముందు ఉన్న అసలు సవాలు

ఒక ఉద్యమం, ఒక సంస్థ, ఒక రాజకీయ పార్టీ బలపడాలంటే దాని నాయకుడు మాత్రమే బలంగా ఉండటం సరిపోదు. ఆ నాయకుడికి నిజం చెప్పగల వ్యవస్థ ఉండాలి. కార్యకర్తల మనసు తెలుసుకునే వ్యవస్థ ఉండాలి. భిన్నాభిప్రాయాలను వినే సంస్కృతి ఉండాలి. ఎప్పటికప్పుడు తన నిర్ణయాలను పునఃసమీక్షించే రాజకీయ పరిపక్వత ఉండాలి.

ఒక రాజకీయ పార్టీ నడిపేటప్పుడు ఆ కార్యకర్తల ఆలోచనలు, మనసు ప్రతిబింబించాలి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి కన్నా ఎక్కువ పాపులర్, చరిష్మాటిక్ లీడర్ JSPలో లేరు కాబట్టి, ముంచినా తేల్చినా పవన్ కళ్యాణ్ గారే. ఇలాంటి సందర్భంలో ఆయన అనాలోచిత, ఆవేశ పూరిత నిర్ణయాల వల్ల తప్పులు జరగకుండా, లేదా తక్కువ తప్పులు జరిగే విధంగా ఉండే విధానాలు అలవర్చుకోవడం చాలా ముఖ్యం.

2019 ఓటమి నుంచి నేర్చుకోవాల్సిన అతిపెద్ద పాఠం కూడా ఇదే. పార్టీని కాపాడేది గుడ్డి విధేయత కాదు — నిజాయితీతో కూడిన విమర్శ. నాయకుడిని బలహీనపరచేది ప్రశ్నలు కాదు — ప్రశ్నలు అడగడానికి భయపడే వాతావరణం.

JSP అధినాయకత్వం ఎప్పుడైతే ఈ ప్రజాస్వామ్య సూత్రాలతో పాటు, ఎప్పటికప్పుడు కార్యకర్తల మనసు తెలుసుకుంటూ, "నాకు అన్నీ తెలుసు" అని ఊరుకుంటే సరిపోదని గుర్తించి, వివిధంగా ఆలోచించే మేధోసంపత్తితో, 365 రోజులు ప్రజల్లో ఉంటూ పార్టీ నిర్మాణం చేసుకుని పని చేస్తే, జనసేన పార్టీని ఆపే శక్తి ఏదీ లేదు.

అలా మంచి కోరి చేసే విమర్శలను తీసుకుంటూ, గ్రౌండ్ ఫీడ్‌బ్యాక్ విని సరైన మార్గంలో నడిచే ఆలోచన చేస్తారా? లేక "నన్నే ప్రశ్నిస్తారా? నాకు అన్నీ తెలుసు, పవన్ కళ్యాణ్ గారి కన్నా మీకు ఎక్కువ తెలుసా? షట్ యువర్ మౌత్స్, గుడ్డిగా ఫాలో అవ్వండి" అంటారా? నాకైతే రెండో మార్గాన్నే ఎంచుకుంటారు అనిపిస్తుంది!!!

పంచుకోండి

వ్యాఖ్యలు

ఒక్కసారి ఇమెయిల్ ధృవీకరణ అవసరం. ఆమోదించిన వ్యాఖ్యలు మాత్రమే కనిపిస్తాయి; ఇమెయిల్ చిరునామాలు కనిపించవు.

ఇంకా ఆమోదించిన వ్యాఖ్యలు లేవు.