జనసేన గతం-ప్రస్తుతం-భవితవ్యం!!!
2024 ఎన్నికల విజయానంతరం జనసేన పాత్ర, పొత్తులో సీట్ల రాజీ, మంత్రివర్గ ప్రతిఫలం, హోమ్ శాఖ మరియు పార్టీ భవిష్యత్తుపై విమర్శాత్మక విశ్లేషణ.

ముందుగా విజయం సాధించిన NDA కూటమి & జనసేన మద్దతుదారులకు అభినందనలు. కళ్యాణ్ మద్దతుదారులకు దాదాపు ఈ 10 సంవత్సరాలు చాల అవమానాలు, ట్రోలింగ్ ఎదుర్కొన్నారు కాబట్టి ఈ విజయం అందరికన్నా కళ్యాణ్ మద్దతుదారులకు ఎక్కువ ఆనందం ఇస్తుంది. అదికూడా ఆ ఘన విజయం జగన్ మీద కాబట్టి. అదృష్టం కొద్దీ ఆంధ్రప్రదేశ్ విజయం కేంద్రంలో కూడా చాల కీలకం అవ్వడం ఇంకో మంచి పరిణామం రాష్ట్రానికి. ఈ పొత్తుకి కళ్యాణ్ గారు కర్త , కర్మ, క్రియ కావున కళ్యాణ్ గారికి ఇంకా ఎక్కువ ప్రాముఖ్యత వచ్చింది . టీడీపీకి కూడా ఎక్కువ ప్రాముఖ్యత ఉంటాది మన కన్నా. చివరికి ఏ పార్టీకి ఎన్ని సీట్స్ ఉన్నాయి అనేది రాజకీయ ప్రాముఖ్యతలని నిర్ణహిస్తాయి అన్నది వాస్తవం.
గట్టిగా నిలబడి జగన్ లాంటి బలమైన వాళ్ళను కూడా చిత్తు చిత్తుగా ఓడించగా వచ్చిన ఈ విజయం వల్ల ఇంతవరకు పెదవి విరిచిన కొంతమంది సామాన్యుల్లో, కళ్యాణ్ గారు చెప్పే సరి కొత్త రాజకీయం కూడా సాధ్యమే అని నమ్ముతారు. మనం ఇప్పుడు పొత్తులో సీట్స్ ప్రకటించిన దగ్గర నుండి మంత్రివర్గం కూర్పు వరకు ఏమి జరిగింది, ప్రత్యర్థి పార్టీ నాయకుల నుండి దేశప్రధాని వరకు అందరు ఒప్పుకునే ఇంత ప్రముఖ పాత్ర పోషించిన జనసేన పార్టీకి ఎంత ప్రతిఫలం దక్కింది అని నిష్పక్షపాతంగా విశ్లేషణ చేసుకుందాం.
పొత్తులో 24 సీట్స్ ప్రకటించిన సందర్బంగా నేను చెప్పిన కొన్ని మాటలతో మొదలెడతాం.
"24 అసెంబ్లీ స్థానాలకి పోటీ చేస్తే , 90% స్ట్రైక్ రేట్ తో సుమారు 20 మంది ఎమ్మెల్యూలు విజయం సాధిస్తారు అనుకున్నా, టీడీపీ 135 లో 65% స్ట్రైక్ రేట్ తో 90+ ఎమ్మెల్యూలు విజయం సాధిస్తారు"
ఎవరో నేను 100 శాతం స్ట్రైక్ రేట్ ఇవ్వలేదు అని, 90శాతం స్ట్రైక్ రేట్ ఇచ్చాను అని విమర్శించారు. అయ్యా, నేను సర్వే సంస్థ కాదు , అంతకన్నా దేవుడ్ని కాదు. 90శాతం స్ట్రైక్ రేట్ రియాలిటీకి చాల దగ్గర ఉన్న నెంబర్ యే. 100శాతం స్ట్రైక్ రేట్ మంచిదే, మీ లెక్క ప్రకారం ఇదే 75 ఫైట్ చేసుంటే 75 వచ్చేది కదా ? 200 శాతం స్ట్రైక్ రేట్ ,300 శాతం స్ట్రైక్ రేట్ తో 10 బంతుల్లో 20 లేదా 30 , 20 బంతుల్లో 50 ,60 కొట్టడం చాలా సార్లు చూస్తుంటాం ,ఒకే ప్లేయర్ 100 బంతుల్లో 200 లేదా 300 కొట్టడం కష్టం. లైఫ్ అఫ్ అవేరేజెస్ విల్ క్యాచ్ అప్ అంటారు . 100శాతం స్ట్రైక్ రేట్ ఘనత జగన్ మోహన్ రెడ్డి పై విపరీతమైన ప్రభుత్వ వ్యతిరేకతకు చిహ్నం. టీడీపీ సాధించిన ఘన విజయానికి కూడా కూటమి వోట్ షేర్(Arthematics) తరవాత అదే కారణం. ప్రతి పోలింగ్ ఏజెన్సీ చెప్పేది కూడా ఇదే. కూటమి వోట్ షేర్(Arthematics) తోనే మెజారిటీ స్టార్ట్ అవుతాది అని , దానితో పాటు జగన్ ఘోర పరిపాలన వల్ల అఖండ మెజారిటీ వచ్చింది. 100శాతం స్ట్రైక్ రేట్ 2029లో వస్తదా ? కష్టం. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేకత ఎంతో కొంత వస్తాది కాబట్టి. టీడీపీ కి కూడా 94శాతం స్ట్రైక్ రేట్ వచ్చింది 144 సీట్స్ కి. అది సామాన్య విషయం ఏమి కాదు. అటువంటి కీలకమైన ప్రభుత్వ వ్యతిరేకత మొదలు కావడానికి కారణం జనసేన పార్టీ మరియు కళ్యాణ్ గారే.
"పూర్తి మెజారిటీ వచ్చిన పార్టిలు పక్క పార్టీలను కూరలో కరివేపాకు లాగే వాడుకుంటారు. 2029 లో కూడా సిట్టింగ్ స్థానాల్లో పొత్తులో పార్టీకి ఇచ్చే పరిస్థితే ఉండదు"
నేను సింపుల్ మెజారిటీ వస్తేనే పొత్తులో చిన్న పార్టీ లను పట్టించుకోరు అన్నాను, అఖండ మెజారిటీ వచ్చింది, అది పవన్ కళ్యాణ్ వల్లే అని వేరే చెప్పాల్సిన అవసరం లేదనుకో. కానీ విన్ అయ్యాక దానికి తగిన గుర్తింపు ఇస్తారా లేదా అన్నదే ప్రశ్న ఇక్కడ. ఇంస్టాగ్రామ్ రీల్స్ , యూట్యూబ్ షాట్స్, ట్విట్టర్, TV5 సాంబా ఎలేవేషన్స్, పొగడ్తలు మాత్రమే కాకుండా, కొన్ని మంచి మంత్రి పదవులు ఇస్తేనే రాజకీయాల్లో తగిన విలువ ఇచ్చినట్టు. జగన్ తిట్టాడు, బాబు గారు పొగిడారు మాకు అదే చాలు అంటే చెప్పేది ఏమి లేదు. "ఈ 20 సీట్స్ కి పవర్ షేరింగ్(సీఎం) ఉండే అవకాశమే లేదు, పొత్తులో భాగంగా ముందే చెప్తే తప్ప. 2-3 ప్రాధాన్యతలేని మంత్రులు ఉండి ఏమీ ‘మార్పు’ తెస్తారో చూద్దాం"
రాష్ట్రం కోసం పొత్తులో సీట్స్ రాజి పడ్డాం, జగన్ ని దించడమే అప్పుడు ప్రధానం అని, తరువాత అన్ని పదవుల్లో, సీట్స్ లో మూడో వంతు తీసుకుంటాం అని చెప్పారు. ఇప్పుడు జగన్ని దించాం , మనకి మూడో వంతు అంటే 8 మినిస్టర్స్ రావాలి కదా ? కనీసం 5 - 6 అయినా తీసుకోవాలి కదా , ఏదో ప్రాముఖ్యం లేని తోక పార్టీ లు పొత్తులో ఉంటె ఇచ్చే ౩ మంత్రులు ఇచ్చారు. మనం ఒక్క బీసీకి గాని, మహిళకి గాని మంత్రి పదవి ఇవ్వలేకపోయాం. సామాజిక న్యాయం చెయ్యాల్సిన భాద్యత మన పార్టీకి కూడా ఉంది కదా. బీజేపీ 2014 లో 4 MLAs కి రెండు మినిస్టర్స్ తీసుకున్నారు. ఇప్పుడు JSP ఇంత ముఖ్యమైన రోల్ ప్లే చేసి 3 మంత్రులు అంటే ఎంత రాజీ పడ్డాం, ఎంత మోసపోతున్నాం. ఎవరి కోసం ఇదంతా. మళ్ళీ రాష్ట్ర ప్రజలు కోసం అనకండి. ఇప్పుడు జగన్ కూడా దిగిపోయాడు.
కళ్యాణ్ గారికి తప్ప మిగతా ఎవరికీ చెప్పుకోదగ్గ మంత్రి పదవులు లేవు. చాలమంది గుడ్డిగా, ఎలివేషన్స్ ఏసుకుంటున్నారు. పర్యాటకం మీద కూడా. దానికి ఫండ్స్ ఏమి ఉండవు పెద్దగా , మౌలికసదుపాయాల కల్పించడానికి బడ్జెట్స్ లో చాల డబ్బులు ఇవ్వాలి, ఇప్పుడు రాష్ట్రం ఉన్న పరిస్థితికి, మానిఫెస్టోలో ఉన్న ఉచితాలకి తప్ప ఇలాంటి వాటికి పెద్దగా ఫండ్స్ ఇచ్చే పరిస్థితి లేదు. ప్రచారాలతో తో పనులు జరగవు. ఇంక బియ్యం పంచే శాఖ గురుంచి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది, ఆ శ్రీకాకుళం కుర్రోడు చెప్పే 25 కేజీలు బియ్యం కాదు 25 సంవత్సరాలు భవిష్యత్తు కావాలి అన్న, కానీ 25 కేజీలు పంచే పనే తీసుకున్నాం. ఎంత పొయెటిక్ గా ఉంది మన న్యూ ఏజ్ పాలిటిక్స్. ఇంత ప్రముఖ పాత్ర పోసిస్తే ఈ స్థాయి మంత్రి పదవులు ఇచ్చి అవమనిస్తారా? లేదా కళ్యాణ్ గారు తీసుకొని రాజీపడిపోయారా?. అందరు కోరుకున్నట్లు జగన్ దిగేసాడు కదా, ఇకనైనా పార్టీ కోసం, రాష్ట్రం కోసం ఆలోచించాలిగా!!!
ఈ దేశంలో పేదోడికి , మధ్యతరగతి ప్రజలకి కష్టంగా ఉండేవి నాణ్యమైన విద్య, వైద్యం, న్యాయం , లా& ఆర్డర్ , పట్టణాలలో రోడ్లు, డ్రైనేజీ మొదలైనవి. కళ్యాణ్ గారు కూడా ఇవే ఎక్కువ మాట్లేడేవారు, మన పార్టీకి కూడా ప్రధాన ఎజెండా అనేవారు.
విద్య: వేలల్లో, లక్షల్లో ఫీజు కడుతున్నారు ప్రైవేట్ స్కూల్స్ కి, ప్రభుత్వ స్కూల్స్ లో 6తరగతి పిల్లలు రాయడం, చదవడం, ప్రాధమిక లెక్కలు చెయ్యడం సగం మందికి రావట్లేదు అని జాతీయ సర్వే రిపోర్ట్స్ చెప్తున్నాయి. మనం బీహార్(72 %) కన్నా 5శాతం వెనకబడి 67 శాతంతో ఎక్కడో అడుగున ఉన్నాం, ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు బాగాలేదు. స్కిల్ తో కూడిన విద్య వస్తేనే భవిష్యత్తులో అభివృద్ధికి ఉపయోగపడుతారు. పాఠశాలలు ఇలా ఉండాలి ఆలా ఉండాలి, ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్, స్పోర్ట్స్ గ్రౌండ్స్ ఇలాంటివి అన్ని చెప్పి ఇప్పుడు ఇలాంటి మంత్రి పదవులు తీసుకోకపోతే ఎలా ?
వైద్యం: వైద్యంలో కూడా ఇదే పరిస్థితి , పేదోడు, మధ్యతరగతి ప్రభుత్వ హాస్పిటల్ కి వెళ్లే పరిస్థితి లేదు. అంబులెన్సు లు పనిచేయవు. మారుమూల ప్రాంతాల్లో ఇంకా ఘోరం. అలాంటి ప్రాంతాల్లో కనిపించే మార్పు తీసుకురావచ్చు. మనం ఎందుకు ఆరోగ్యశాఖ తీసుకోకూడదు?, మనం ఎన్నోసార్లు UK లాంటి ఆరోగ్య వ్యవస్థ ఉండాలి చెప్పాం, మనకు ఉన్న బడ్జెట్తో అది చేయలేములే, అది వేరే విషయం. కనీసం ఎంతో కొంత ప్రభుత్వా ఆసుపత్రులలో సౌకర్యాలు మెరుగు పరచొచ్చు కదా, ఒక్క ఆంధ్ర లోనే ఏడాదికి 10-15 లక్షల మంది ఖరీదైన ప్రైవేట్ వైద్య ఖర్చులతో పేదరికం లోకి నెట్టి వేయబడుతున్నారు. అరకు లాంటి మారు మూల ప్రాంతాల్లో దీనమైన వైద్య సదుపాయాలు చూసి గొంతెత్తడం తప్ప, రాష్ట్రం కోసం, ప్రజల మేలు కోసం అని తీసుకోకపోతే ఎలా? R&B: రోడ్స్ మీద జనసేన చాలా బలంగా క్యాంపైన్ చేసారు. రోడ్స్ (R &B ) వేసి ప్రజలకి బాగా కంటికి కనిపించే ఈ అభివృద్ధి పనులకు కళ్యాణ్ గారికి , పార్టీకి మంచి మైలేజ్ వచ్చి ఉండేది కదా ? ప్రతిపక్షంలో పోరాటమే కాదు , అభివృద్ధి కూడా మంచిగా చేస్తారు అని పేరు సంపాదించేవారు.
పోలీస్, కోర్ట్స్ :పోలీస్ వ్యవస్థలో కూడా అదే దౌర్భాగ్యం, డబ్బుంటే తప్ప పేదోడు, మధ్యతరగతి పోలీస్ స్టేషన్ కి వెళ్లే పరిస్థితి లేదు. కోర్ట్స్ ధీ అదే పరిస్థితి . విద్య, వైద్యం తో పాటు న్యాయం చాల ఖరీదు అయిపొయింది. కొన్నిసార్లు Dr YS సునీత గారు లాగా డబ్బున్నా, నాయ్యం కోసం పోరాట స్ఫూర్తి ఉన్నా కూడా రాజకీయ కబంద హస్తాల్లో ఉన్న పోలీస్ వ్యవస్థ వల్ల అది కూడా సాధ్యం కాదు. ఎన్నో రిఫార్మ్స్ తేవచ్చు . ప్రజలకి నాయ్యం ఎడారిలో ఎండమావి అయ్యింది. లోయర్ కోర్ట్స్ , జడ్జెస్ ని పెంచి , న్యాయం తొందరగా జరిగేటట్టు చెయ్యచ్చు.
సినిమా కాదు నిజ జీవితంలో పోరాటానికి దమ్ము ధైర్యం Damn గట్స్ పరిచయం మాట్లాడే పవన్ కళ్యాణ్ గారు కాకుండా ఇంక ఎవరు చెయ్యాలి హోమ్ మినిస్టర్ పదవిని, చట్టం బలమైన వాళ్ళకి బలహీనంగాను, బలహీనులకు బలంగా పని చేస్తుంది అని మాట్లాడే కళ్యాణ్ గారు , ప్రజలు అవకాశం ఇచ్చినప్పుడు ఆ బాధ్యతలకు దూరంగా ఉంటె ఏమనుకోవాలి? 30 వేల మంది ఆడపిల్లలు తప్పిపోయారు అని మాట్లాడి వాటిని సరి చేసే అవకాశం వచ్చినప్పుడు ఎందుకు తీసుకోలేదు హోమ్ శాఖ? సుగాలి ప్రీతీ కి ఓడిపోయి నిస్సహాయ స్థితిలో ఉండి, ఒక సభ పెట్టి గొంతెత్తడం మాత్రమే నేను చేయగలిగింది అన్నప్పుడు, అలాంటి అభాగ్యులకు న్యాయం చేసే పరిస్థితి వచ్చినప్పుడు దూరంగా ఉంటె ఎలా అర్థం చేసుకోవాలి. అవినీతి మీద రాజీ లేని పోరాటం చేస్తాం అని చెప్పి, హోమ్ మినిస్టర్ గా మన ఏడూ సిద్ధాంతాలలో ఒక సిద్ధాంతం ని బలమైన చట్టాలు ద్వారా అమలు పరిచే అవకాశం వస్తే వదులుకుంటే ఎలా? పూర్తి మెజారిటీ వస్తేనే మన సిద్ధాంతాలు అమలు పరచాలా? అవేమి వివాదాస్పద విషయాలు కాదు కదా.
మోడీ తరువాత అత్యంత శక్తివంతమైన మంత్రిత్వ శాఖ ఏదంటే హోమ్ మినిస్టర్ అమిత్ షా నే అంటారు, కొందరు రాష్ట్రాల్లో హోమ్ మంత్రికి లో ఏమి ఉండదు అని కవర్ డ్రైవ్స్ ఆడుతున్నారు. లా& ఆర్డర్ స్టేట్ సబ్జెక్టు. స్టేట్ హోమ్ మినిస్టర్ కె ఇంకా ఎక్కువ ఫీల్డ్ లో ఎగ్జిక్యూషన్ పవర్ ఉంటాది. అందుకే రాష్ట్రాలు సిబిఐకి కూడా అనుమతి రద్దు చేస్తున్నాయి. స్టేట్ కి ఇంటలిజెన్స్, క్రైమ్ డిపార్ట్మెంట్, అవినీతి నిరోధక విభాగం అన్ని ఉంటాయి. గుజరాత్ లో కూడా అమిత్ షా హోమ్ మినిస్టర్ గానే ఉన్నాడు. ఇప్పుడు దేవేంద్ర ఫడ్నావిస్ 5 సంవత్సరాలు సీఎంగా చేసి మళ్ళి ప్రభుత్వంలో చేరేటప్పుడు హోమ్ మినిస్టర్ గానే తీసుకున్నాడు. అత్యంత శక్తివంతమైన ముఖ్యమంత్రులతో ఒకరు అయినా యోగి ఆదిత్యనాథ్ స్వయంగా హోమ్ మినిస్ట్రీ ని చూసుకుంటున్నాడు. సగం యోగి పాపులారిటీ లా & ఆర్డర్ వల్లే వచ్చిందనడంలో అతిశోయోక్తి లేదు. తమిళనాడులో కూడా సాక్షాత్తు ముఖ్యమంత్రి MK స్టాలిన్ యే హోమ్ మినిస్టర్. మన పక్క రాష్ట్రము తెలంగాణలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యే హోమ్ మినిస్టర్ గా ఉన్నాడు. వెస్ట్ బెంగాల్ లో మమతా బెనర్జీ హోమ్ మినిస్టర్. కర్ణాటక లో బాగా సీనియర్ కాంగ్రెస్ లీడర్ పరమేశ్వర్ చేస్తున్నారు. సీఎం కన్నా సీఎం రమేష్ కాదు పవర్ఫుల్, అన్ని అధికారాలతో ఉన్న ఇండిపెండెంట్ హోమ్ మినిస్టర్.
చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ హోమ్ మినిస్టర్ గా చెప్పినట్టు చెయ్యలేదు అని మినిస్ట్రీ నుండి తీసెయ్యగలడా ? ఈ రోజు రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ సంపాదించిన విలువకి చంద్రబాబు నాయుడు కళ్యాణ్ని మంత్రివర్గం నుంచి తీసే ధైర్యం అయితే చెయ్యలేరు నాకు తెలిసి. వాళ్లిదరు అభిప్రాయం బేధాలు లేకుండా పనిచేసుకుంటున్నారు అన్నది వేరే విషయం. మనం ఎప్పుడు చెప్పే ధర్మం, ఆ ధర్మాన్ని రక్షించి, అధర్మాన్ని శిక్షించే పోలీస్ వ్యవస్థని నడిపించే హోమ్ మినిస్టర్ ఎందుకు తీసుకోకూడదు?. ఇంకా ఎంత రాజీపడుతారు, లేదంటే ఈ త్యాగాలు రాష్ట్ర ప్రజల కోసమా లేదా టీడీపీ కోసమా? రాష్ట్ర ప్రజల కోసం అయితే కళ్యాణ్ లాంటి నిజాయతి పరులు చేతిలో పోలీస్ వ్యవస్థ ఉంటె మంచిది కదా?. ఇక్కడ రాష్ట్రము కోసం ఆలోచించలేదా కళ్యాణ్ గారు?. ఊరు ఊరునా విద్యార్థులను నాశనం చేస్తున్న, దేశంలో అన్ని రాష్ట్రాలకి సరఫరా చేస్తున్న డ్రగ్స్, గంజాయి గాని, అక్రమ మైనింగ్, ఎర్రచందనం అక్రమ రవాణా ఇవన్నీ మీరు లెవా లెత్తిన అంశాలే కదా, వీటిని దారిలో పెట్టాలంటే పోలీస్ వ్యవస్థతోనే సాధ్యం కదా?
హోమ్ మినిస్టర్ ఏమి చేయగలడో చెప్తా, మొత్తం పోలీస్ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకు రావచ్చు, సుప్రీమ్ కోర్ట్ 2006 లో చెప్పిన రిఫార్మ్స్ ఉన్నాయి. ప్రకాష్ సింగ్ కేసులో 2006 లో సుప్రీమ్ కోర్ట్ ఇచ్చిన మైలురాయి లాంటి తీర్పుని మనం అమలు పరిచి మనం ఎప్పుడు చెప్పే మార్పు కు నాంది పలకొచ్చు. మీలాంటోళ్లని, సామాన్యుల్లాని భవిష్యత్తులో జగన్ లాంటి పాలకులు పోలీస్ వ్యవస్థని దుర్వినియోగం చేసే పరిస్థితి లేకుండా చెయ్యొచ్చు. దేశం మొత్తం ఆంధ్ర వైపు తిప్పుకోవచ్చు. రాజకీయాల్లో మార్పు పోలీస్ వ్యవస్థ మార్పుతోనే వస్తాది. ఎందుకంటే అధికారం మొత్తం అక్కడే ఉంటాది. అవినీతి పరుల భరతం పట్టాలన్నా, రాజకీయ పార్టీకి ఎదుగుదలకి వాడుకోవాలన్న, ప్రతిపక్షాలలో కావాల్సిన నాయకుల్ని మన పార్టీలోకి తెచ్చుకోవాలన్న ఉపయోగపడేది ఇదే. ఇంకా ఎన్నెన్నో ఇలా చెప్పుకుంటూ పోతే.
మనం హోమ్ మినిస్టర్ తో పాటు(నిజంగా ఇచ్చి ఉంటె), పంచాయతీ రాజ్ కూడా మన పార్టీ యే తీసుకొని ఉండచ్చు కదా, పంచాయత్ రాజ్ & రురల్ డెవలప్మెంట్ లో కళ్యాణ్ బ్రాండ్ విపరీతంగా పెరిగిపోతుంది , పార్టీ నిర్మాణానికి గ్రాస్ రూట్స్ లో ఉపయోగపడుతుంది అనుకునే వాళ్ళకి చెప్పేది ఏంటంటే, ఉపాధి హామీ పథకం, ప్రధానమంత్రి గ్రామీణ రహదారులు, రైతు భరోసా కేంద్రాలు, కేంద్ర ప్రభుత్వ గ్రాంట్స్ ఇవే మేజర్ గా ఉండేది. ఇవన్నీ బాగానే జరుగుతున్నాయి ఇప్పుడు, కొన్ని చిన్న చిన్న సమస్యలు తప్ప, వీటిల్లో ఇంక్రెమెంటల్ గా అక్కడక్కడ ఏమైనా కొన్ని పనులు చెయ్యడం తప్ప పెద్దగా స్కోప్ ఉండదు. MLA అనుమతి , అతని బ్రాండ్ ప్రమోషన్ తేనె ఈ పనులు అన్ని చెయ్యాలి. కళ్యాణ్ కన్నా ముందు అతనికి వస్తాది పేరు ప్రఖ్యాతలు. వేరే పార్టీ MLAs యే ఎక్కువ కాబట్టి వాళ్ళకే ఎక్కువ ఉపయోగం రాజకీయంగా ఆలోచన చేసిన కూడా, MLA ని కాదని ఏ పని చేసే పరిస్థితి ఉండదు. బాబు గారు కూడా MLA ని ముందుంచి ఎందుకు భాగస్వాయం చెయ్యాలో బాగా వివరిస్తారు అవసరం అయితే.
ఒకే ఒక్క అవకాశం ఇక్కడ కళ్యాణ్ గారికి, అయన పేరు , పార్టీ పేరు చరిత్రలోకి ఎక్కాలంటే, పంచాయతీ రాజ్ లో పంచాయతీని ఆర్థికంగా స్వతంత్ర ఇచ్చే రిఫార్మ్స్ ఏమైనా చెయ్యగలిగితే. జాతీయ పంచాయత్ రాజ్ ఆక్ట్ సూచనలు ప్రకారం 29 అధికారాలు పంచాయతీలకు బదలాయించడం తో పాటు స్టేట్ ఫైనాన్స్ కమిషన్(SFC ) రిఫార్మ్స్ సూచనల లో 10 శాతం బడ్జెట్ లో నిధులు తప్పనిసరి ఇచ్చేటట్టు చట్టం ఏమైనా చేస్తారా? ఆ 10 శాతం నిధులు ఈ బడ్జెట్ లేదా తరవాతి బడ్జెట్ నుండి అమలు పరుస్తారా? ఆలా చేసిన రోజు కొంత న్యాయం అవుతుంది కళ్యాణ్ గారు ఆ శాఖ తీసుకొన్నందుకు. ఎందుకంటే అది శాశ్వతమైన మార్పుకి నాంది పలుకుతుంది.
ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే, కళ్యాణ్ గారు ఈ మంత్రి అవుతారు అని లీక్స్ ద్వారా గుర్తుంచి, దానికి అనుగునంగా ఎలేవేషన్స్ , ఇంటెలెక్టుల్ కవర్ డ్రైవ్స్ వేస్తున్నారు పూర్తిగా ఆలోచించకుండా, మద్దతుదారులు నిజాన్ని చెప్పలేని పరిస్థితిలో ఉన్నందుకు చాల భాధ గా వుంది. హోమ్ మినిస్టరీకి సమయం ఎక్కువ ఇవ్వాలనుకునే వారికి ఒకటే చెప్పదల్చుకున్న, సామర్థ్యం ఉన్నా అధికారులను నియమిస్తే, అన్ని వాళ్ళే చూసుకుంటారు. ఇంకా పంచాయత్ రాజ్ లోనే ఎక్కువ సమయం కావాలి, ప్రాజెక్ట్ రిపోర్ట్, ఫండ్స్, అన్ని రకాల అనుమతులు, లోకల్ అధికారుల జిల్లా కలెక్టర్ నుండి పంచాయతీ ప్రెసిడెంట్ వరకు, MLA లతో, కో-ఆర్డినేషన్ తో ఫాలోఅప్ చేస్తూ చెయ్యాలి. అధికారులు ప్రాసెస్ తో చంపేస్తారు. ఇండియన్ బ్యూరోక్రసీ ఫేమస్ అందులో. అంతర్గత వెన్నుపోట్లు ఉంటాయి, ఇవన్నీ దాటుకొని వచ్చేకాడికి పుణ్యకాలం గడిసిపోతుంది. అదే హోమ్ లో Larger Perception గేమ్ ప్లే చెయ్యొచ్చు. నిజమైన పవర్ పోలీస్ వ్యవస్థలో ఉంటాది. ఆ పవర్ తోనే మిగతా అన్ని సాధ్యం. మనకి క్యాడర్, అభిమానులు ఉన్నారు, లేనిదీ బలమైన స్థానిక MLA స్థాయి నాయకులు. వేరే పార్టీలలో నుండి నియోజకవర్గ స్థాయి నాయకులు కి హెల్ప్ చేస్తూ వాళ్ళను పార్టీలోకి తీస్కొని భవిష్యత్తుకి సన్నద్ధం అవ్వొచ్చు.
ఇంకొక మాట అమిత్ షా గుజరాత్ లో మినిస్టర్ గా ఉన్నప్పుడు హోమ్ , లా & జస్టిస్ , జైళ్లు , బోర్డర్ సెక్యూరిటీ, సివిల్ డిఫెన్సె, ఆబ్కారీ, రవాణా, హోమ్ గార్డ్స్, గ్రామ రక్షక్ దళ్, పోలీస్ హోసింగ్, లెజిస్లేటివ్ & అసెంబ్లీ అఫైర్స్ ఇన్ని చేసాడు సమర్థవంతంగా. ఇక్కడ ఒక్క హోమ్ మంత్రిత్వ శాఖకే కష్టం, ట్రాప్, గాడిద గుడ్డు అంటూ కవర్ డ్రైవ్స్ చెప్తున్నారు. కళ్యాణ్ గారికి హోమ్ మినిస్ట్రీ ని సమర్థవంతంగా నిర్వహించే సామర్థ్యం ఉంది అని, అన్నిటికన్నాహోమ్ శాఖే బాగా సరిపోతుంది అని నేను నమ్ముతున్నాను.
2020 లో ఎప్పుడో అనుకున్న పొత్తు మెల్లిగా 2022 లో వ్యతిరేక వోట్ చీలనివ్వను అని పబ్లిక్ స్టేటుమెంట్ తో మొదలు అయ్యి, టీడీపీ డిజిటల్ మీడియా దగ్గర్నుంచి, టీడీపీ అధికార ప్రతినిధులు ఎంతో మంది స్టేట్మెంట్స్ ఇచ్చారు 25 అని. కళ్యాణ్ గారు కూడా దానికి కట్టుబడే ఆయన దగ్గరకు వచ్చిన, వస్తానన్న లీడర్స్ కూడా వద్దు అని చెప్పడం అంత ఒక పద్ధతి ప్రకారమే జరిగింది. చివరి వరకు లాక్కొచ్చి, మద్దతుదారులని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి ఎన్నికలు కానించారు అనోవాల్సి వస్తుంది. జరిగిన, జరుగుతున్న పరిణామాలని చుస్తే , తీసుకున్న 21లో అయినా JSP భవిష్యత్తు లీడర్లుకి, JSP కి PRP నుండి బలం ఉన్నా స్థానాల్లో తీసుకున్నారా అంటే, సగం JSP బలహీనంగా ఉన్నా స్థానాల్లో తీసుకున్నారు. ఇప్పుడు అంటే బలమైన వైసీపీ వ్యతిరేక సునామీలో అన్ని విజయం సాధించారు కాబట్టి అంత బాగుంది అనుకుంటాం. 2029 /2034 ఇలాగె ఉండదు. ఇప్పుడు పోత్హులో గెలిచినా స్థానాలు ఎవరు పక్క పార్టీ కి ఇవ్వరు. ఒకటి రెండు సీట్స్ ఇవ్వాలన్నా చాల కష్టం. 21లో కూడా పొత్తులో ఉన్న పార్టీలతో ఎంత లాక్కున్నారో, పీక్కున్నారో అందరికి తెలిసిందే. ఇంక 2029 లో న్యాయంగా అయితే కనీసం మూడు వంతు సీట్స్ ఇవ్వాలి. అలాంటి పరిస్థితి కనుచూపు దూరంలో కూడా కనపడట్లేదు. దీనివల్ల వేరే పార్టీ నాయకులు కూడా వచ్చే పరిస్థితి ఉండదు. మనం సీట్స్ ఇస్తాం అని ముందుగానే చెప్తే తప్ప. వాళ్ళకి పొత్తులో ఉంటె వీలు కాదని వాళ్లకి తెలుసు కాబట్టి . కేంద్రంలో బీజేపీకి సీట్స్ తగ్గడం వల్ల 2029 లో కూడా పొత్తు ఉండాల్సిన పరిస్థితి ఉంది.
JSP నిజంగా మేలు- కోరుకునే మద్దతుదారులు అయితే, మనకి ఈ పొత్థు లో ఏమి న్యాయం జరిగింది అని చూసుకుంటే, JSP చేసిన శ్రమ, సహకారానికి కి JSPకి వచ్చిన సీట్స్ కానీ మినిస్ట్రీస్ కానీ అసలు సంబంధమే లేదు. టీడీపీ వాళ్ళు మేకలు తిని, JSPకి నూకాలు ఇచ్చిన చందాన ఉంది.
ఆఖరికి ఆ KK కూడా చెప్తున్నాడు JSP తరుపున సీట్స్ చర్చించిన పెద్ద మనిషి చాల తప్పు చేసాడు అని. తీసుకున్న సీట్స్ కూడా చాల రాంగ్ ప్లేసుల్లో తీసుకున్నారు అని. 2009 లో తెరాస(TRS ) 119 నియోజగవర్గాలు ఉన్న ప్రాంతంలో 45 సీట్స్ తీసుకున్నది. ఆ పార్టీకి దాని ముందు ఎలక్షన్స్ లో కూడా ఓట్లు 6 శాతమే. ఈ తప్పులు అన్ని జగన్ వ్యతిరేక వేవ్ లో ఇప్పుడు తెలియకపోవచ్చు గాని, ఇవన్నీ భవిష్యత్తులో వెంటాడుతాయి. బాబు గారు దూర దృష్టితో ఆలోచించే చాల బలహీన స్థానాలు ఇచ్చారు అని అందరికి తెలుస్తుంది కొంతమందికి తప్ప.
IVR సర్వే అనేది పెద్ద బోగస్, టీడీపీ సర్వేస్ లో చాల మందికి నెగటివ్ , కొంతమందికి దారుణంగా నెగటివ్ వచ్చింది, కానీ వాళ్ళందరూ ఘన విజయం సాధించారు. ఆ IVR సర్వే ని చూపించి కొంతమందికి కావాలనే టికెట్స్ ఇవ్వకుండా చేశారు. 24 సీట్స్ కి ఈ బేసిస్ తో ఒప్పుకున్నారో ఆ దేవుడికే యే తెలియాలి. ఈ 2024 ఎలక్షన్ మొదట్నుండి అంతా బాబు గారి మాయదారి స్క్రిప్ట్ లోనే నడిచింది. ఇదే IVR తోనే బాబుగారు 2019 లో కూడా సీట్స్ ఇచ్చారు ఎందుకు అంత ఘోరంగా ఓడిపోయారు?. అది శకుని పాచికలు లాంటివి. డేటాని నచ్చినట్టు చూపించి ఆడే రాజకీయ ఆటకి వాడుకుంటున్నారు. సొంత పార్టీ ఏ కాకుండా పొత్తు పార్టీలో టికెట్స్ ఎవరికీ రావాలి, ఎన్ని రావాలి అని డిసైడ్ చేయడానికి కూడా. రాజకీయాల్లో ఓటరు మార్పుని పాత చరిత్రనే ఎక్కువ అద్ధరంగా తీసుకుంటే కొత్త పార్టీలు ఎప్పటికి ఎదగవు. అది ఇలాంటి IVR ఫ్రాడ్ సర్వేళ్లలో తెలియదు. జగన్ 17 లక్షల సాంపిల్స్ తీసిన తెలియలేదు అంటే, ఒక రాజకీయ మార్పుని ఈ IVR సర్వే ఓటరు నాడి పట్టుకోగలదా? ఎవర్ని మోసం చేస్తున్నారు ఇలాంటి ఫ్రాడ్ IVR సర్వే తో ? పార్టీ మద్ధతుదారులు కూడా ఇలాంటివన్నీ గమనించి , నిర్మాణాత్మక విమర్శ, సూచనలు చేసిన రోజున, పార్టీ వాటిని సదుద్దేశంతో తీసుకున్న రోజున యే పార్టీ అయినా వేగంగా ఎదుగుతుంది.
వాసం శెట్టి సుభాష్ JSP లో జాయిన్ అవ్వాలని కళ్యాణ్ గారిని కలిసి ఆఖరికి టీడీపీ లోకి పంపించినట్టున్నారు కన్నా లక్ష్మి నారాయణ లాగ!!!.
ఈ రోజు 40 MLAs ఉంటె ఎంతమంది యంగ్ లీడర్స్ JSP పార్టీ ద్వారా ఎస్టాబ్లిష్ అయ్యుంటారు . పొత్తులో సీట్స్ ప్రకటించిన సందర్భంలో మాలాంటోళ్ళు చెప్పినట్టు, ఇప్పుడు ఆలోచిస్తే పొరపాటే కదా. కళ్యాణ్ గారు చెప్పిన కారణాలు అన్ని తప్పు అని ప్రూవ్ అయ్యింది కూడా. ప్రభుత్వ వ్యతిరేకత & కూటమి వోట్ షేర్ ఒక్కటి అవ్వడం వల్ల తిరుగులేని విజయం వస్తాది అని అందరికి తెలుసు. నా Pinned ట్వీట్ కూడా ఉంది.
పవన్ కళ్యాణ్ గారి దగ్గర డబ్బు లేదు రాజకీయం చేయడానికి, 10 ఏళ్ళు అయినా బూతు కమిటీస్ వేసుకునే టైం లేదు. ప్రతిపక్షంలో రాజకీయ శూన్యత ఉన్నప్పుడు ఆ పరిస్థితులను సొంత పార్టీ ఎదుగుతలకి వాడుకునే ఆలోచన లేదు. నియోజకవర్గ నాయకులతో ఎప్పుడు గాని పార్టీ పరిస్థితి గురుంచి నేరుగా రివ్యూ చేసేది లేదు. పార్టీ పరిస్థితి ఎలా వుంది?, నియోజక వర్గం లో చేరికలు పురోగతిని అడగరు. ఎవరైనా వస్తాను అంటే వాళ్లకి అందుబాటులో ఉండే పరిస్థితి లేదు. చివరికి కొంతమంది కలిస్తే వాళ్ళకి వద్దు డబ్బులు వృధా చేసుకోకండి టికెట్ ఇవ్వలేము అని ముందుగానే చెప్పేస్తారు. కొంత బలమైన నాయకులూ వస్తానంటే పక్క పార్టీలోకి వెళ్ళండి టికెట్ వస్తాది అంటారు. ఆ స్తానంలో జనసేన బలంగా ఉన్నా కూడా. 25 సీట్స్ ఎప్పుడో 2020 లోనే కుదిరిపోవడం వల్ల మిగతా ఎవరు వచ్చిన టికెట్ ఇవ్వలేని పరిస్థితి అని అర్థం చేసుకోవాల్సి వస్తుంది. టీడీపీ తో 2020 నుండి పొత్తు చర్చలు నడుస్తున్నాయి అని , JSP పార్టీ హేండిల్ షేర్ చేసిన ఇండియన్ ఎక్సప్రెస్ ఆర్టికల్ లోనే ఉంది!!!
డబ్బులు ఉన్నాయా మనకు అని అడుగుతారు మళ్ళి కళ్యాణ్ గారు ఇలా అందరిని వద్దు అని చెప్పి. 2019లో SBI క్లర్క్ పోస్ట్లు ఇచ్చినట్టు MLA సీట్స్ ఇచ్చాక ఏమి నేర్చుకున్నారు?. వైసీపీ ని ఎదుర్కోవాలంటే బలంగా ఖర్చు పెట్టె నాయకులూ కూడా కావాలని తెలియదా ? దానికి మనం ఏమి చేసాం?. డబ్బు ఖర్చు పెట్టలేని వాళ్ళకంత ఇంచార్జి పోస్ట్లు ఇచ్చి చివరికి మద్దతుదారులని ఎదురుదాడికి దిగే స్టేజి కి తెచ్చుకున్నారు. అన్ని పనుల్లో ఒక్క వ్యక్తికే బాధ్యత అప్పగిస్తే , ఆయనకి నచ్చినట్టు పార్టీలో జరుగుతుంటే, కార్యకర్తలు, నాయకులు అందరు ఇబ్బంది పడుతుంటే, ప్రత్యామ్నాయంగా ఇద్దరు ముగ్గురితో ఒక వర్కింగ్ కమిటీ ఏర్పాటు చేసే బదులు వెనకేసుకుంటూ వచ్చారు కళ్యాణ్ గారు. మంచి సందేశం ఇచ్చారు కార్యకర్తలకు!!!
2024 లో డబ్బు వల్లే గెలిచాం అని అనుకుంటున్నారా? వైసీపీ ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఎందుకు ఇంత ఘోరంగా ఓడిపోయింది. ఒకరు ఇద్దరు తప్ప, బీజేపీ MLAs 5 -10 కోట్లుతో 80 % స్ట్రైక్ రేట్ తో ఎలా గెలిచారు?. రాజకీయాలకు డబ్బే ప్రధానం కాదు అని నేను నమ్మతా కళ్యాణ్ గారు లాగే . ఈ 5 -10 సంవత్సరాలు పార్టీకి పని చేసినోళ్లకి టికెట్ ఇవ్వకపోతే, ఎవరైనా పిలిచి ఓదార్చి, సర్ధి చెప్పి, భవిష్యత్తులో న్యాయం చేస్తాం అని పార్టీలో కొనసాగమంటారు. కానీ కళ్యాణ్ గారు మాత్రం వాళ్ళతో మాట్లాడరు, నమ్మకం ఉంటె ఉండమని లేకపోతే వెళ్ళిపోమంటూ అంటూ పార్టీ సీనియర్ నాయకులూ ద్వారా సందేశం పంపిస్తారు. సీట్ రాని ఇంచార్జి ఊర్లోనే మీటింగ్ ఉన్నా కలిసి మాట్లాడటానికి ఇష్టపడరు. కనీసం ఫోన్ లో అయినా మాట్లాడండి సర్ అని సీనియర్ నాయకులూ అంటే లేదు అని చెప్పేస్తారు. సాక్షాత్తు ప్రధాన మంత్రి కూడా టికెట్ రాని MLA /MP లకి ఫోన్ చేసి మాట్లాడుతుంటే, ఇదేంటో వింత రాజకీయం.
కళ్యాణ్ గారు , NRI మద్దతుదారులతో , ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కుంటూ బాగా చదువుకుని, దేశం కానీ దేశంలో బతుకుతూ , NRIలు డబ్బులు పార్టీకి ఇవ్వడం కన్నా మీ ఆలోచనలు, మీ ప్రపంచ అనుభవాలు పార్టీ వృద్ధికి ఎక్కువ కావాలి అని చెప్పే మీ మాటలకి , మీ చేతలకు సంబంధం లేనప్పుడు విమర్శిస్తే , ఎక్కోడో కూర్చొని మాట్లాడకండి అని ఎద్దేవా చెయ్యడం మీ స్థాయికి తగదు. ఇన్నిరోజులు మద్ధతుదారులు 2019లో మద్దతు ఇవ్వలేదని, దానికి కారణం పాత స్వయంకృపరాధాలు అని తెలిసి కూడా పదే పదే దొబ్బిపోడిచే మీరు ఇక నుండి ఆ ఎమోషనల్ బ్లాక్మెయిల్ ఆపేస్తారు అని ఆశిస్తున్నాను. ఇక అంతా మీ ప్రతిభ, పనితీరు మీదే ప్రజలు దీవెలనాలు ఉంటాయి.
ఇంకోమాట జగన్ మద్దతు దారులు ఇన్ని తప్పులు చేస్తున్నా జగన్ని అడగట్లేదు. నేను ఏ పదవి లేకున్నా నన్నే ఎందుకు మీరు ఇంత అడుగుతున్నారు అని మద్దతుదారులని అడిగారు , జగన్ మద్దతుదారులు , మీ మద్దతుదారులు ఒక్కరే అని ఎలా అనుకుంటారు?. సమాజం లెఫ్ట్ , రైట్ అనే రెండుగా చీలిపోయుంటారు అని మీకు తెలియదా? ,దానిలో ఒక వర్గం తప్పు, ఒప్పులు కన్నా , సమాజం ఎలా పోయినా నాకేంటి, నీకేంటి అనే ఆలోచనతో , నీకెంత , నాకింత అనే భావజాలానికి , తమ వర్గమే అని ట్రైబల్ ఆలోచనతో ఉంటారు అని తెలియదా మీకు. మీరు ఇలా తెలిసి మాట్లాడటం మీ స్థాయికి తగదు. ఇంక ఎప్పుడు జగన్ మద్దతుదారులతో పోల్చకండి. మాకే కాదు, అది మీకు కూడా అవమానమే .
చివరగా ఒక వింత తమాషా ఏంటంటే , 2024కి కళ్యాణ్ గారు బీజేపీకి ఇష్టం లేకపోయినా బలవంతంగా టీడీపీతో పొత్తులోకి తీసుకొచ్చారు, 2029లో కళ్యాణ్ గారు ఈ పొత్తు నుండి బయటికి రావాలన్నా, బీజేపీ ఈ పొత్తు నుండి కళ్యాణ్ గారిని బయటికి పోనివ్వదు. దీనితో పాటు జనసేనకు 2029లో పొత్తులో మూడోవంతు సీట్స్ పరిచయం కూడా మర్చిపోవాల్సిందే. 2024లో బీజేపీకి వచ్చిన ఫలితాల ప్రభావం అలాంటిది. ఆంధ్రప్రదేశ్ లో మూడో ప్రత్యామ్నాయం ఇంకో దశాబ్దం పక్కకి పోయినట్టే.
ఇట్లు మీ శ్రేయోభిలాషిని Raj Pattem/
పంచుకోండి
వ్యాఖ్యలు
ఒక్కసారి ఇమెయిల్ ధృవీకరణ అవసరం. ఆమోదించిన వ్యాఖ్యలు మాత్రమే కనిపిస్తాయి; ఇమెయిల్ చిరునామాలు కనిపించవు.
ఇంకా ఆమోదించిన వ్యాఖ్యలు లేవు.